
శ్రీశైలదేవస్థానం:మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం సాంప్రదాయరీతిలో నిర్వహించింది. సాయంత్రం 5.30గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణములో పల్లకీ సేవ జరిగింది. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, మల్లికార్జునసదన్, బయలువీరభద్రస్వామి ఆలయం, అక్కడ నుండి వలయరహదారి మీదుగా గణేశసదనం, సారంగధర మండపం, గోశాల, మల్లమ్మ మందిరం (మల్లమ్మకన్నీరు). పుష్కరిణి వద్దకు చేరింది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంది. నందిమండపం నుండి ఆలయమహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగిసింది.ఇల కైలాసంగా ప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రములో గిరిప్రదక్షిణ చేయడం ఎంతో ఫలప్రదంగా భావిస్తారు.