
శ్రీశైల దేవస్థానం:వినాయక చవితిని పురస్కరించుకొని లోకకల్యాణం కోసం 9 రోజులపాటు జరిపే గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం ప్రారంభం అయ్యాయి.
సెప్టెంబరు 5వ తేదీ ఉదయం జరిగే పూర్ణాహుతి, అవబృథ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ నవరాత్రోత్సవాలలో 9 రోజులపాటు ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతి స్వామివారికి, యాగశాలలో వేంచేబు చేయించిన కాంస్య గణపతి మూర్తికి, సాక్షిగణపతి ఆలయంలోని స్వామివారికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన వరసిద్ధి వినాయకస్వామి వారికి (మృత్తికా గణపతిస్వామివారికి) విశేషంగా పూజాదికాలు జరుగుతాయి .
కాగా ఈ ఉదయం ఉత్సవాల ప్రారంభంలో భాగంగా యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, పుణ్యాహవాచనం, తదితర కార్యక్రమాలు జరిపారు.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా అధ్యాపక (స్థానాచార్యులు), అర్చక స్వాములు, వేదపండితులు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి :
ఆలయ ప్రవేశం చేసిన తరువాత వేదపండితులు వేద పారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివ సంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు వారు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నవరాత్రతోత్సవ సంకల్పాన్ని
పఠించారు.
ఈ సంకల్పంలో, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.
అనంతరం నవరాత్రోత్సవాల నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు. కంకణ పూజ, కంకణధారణ
అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపారు. తరువాత కంకణధారణ కార్యక్రమం జరిపారు.
ఋత్విగ్వరణం :
ఉత్సవాలలో భాగంగా ఋత్విగ్వరణం నిర్వహించారు. ఉత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
పుణ్యాహవచనం :
ఉత్సవాలలో భాగంగా వృద్ధి , అభ్యుదయాల కోసం పుణ్యాహవచనం జరిపారు.
పుణ్యాహవచనం తరువాత అఖండ దీపస్థాపన జరిపారు.
కలశస్థాపన :
అఖండ దీప స్థాపన తరువాత మండపారాధన చేసి గణపతి కలశస్థాపన చేశారు. కలశస్థాపన తరువాత కలశార్చన చేశారు.
అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపారు.
అంకురార్పణ :
ఈ నవరాత్రతోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. దీనినే ” మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి వాటిని మొలకెత్తించే పనిని ప్రారంభం. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు.
ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ యాగశాలలో మండపారాధనలు,
హవనములు, జపాలు, పారాయణలు.
గణపతిహోమం, దేవతా
కాగా ఉత్సవాల చివరి రోజైన సెప్టెంబరు 5వ తేదీన ఉదయం జరిగే పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
రత్నగర్భగణపతికి ప్రత్యేక పూజలు
గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగానే ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భగణపతి స్వామివారికి విశేషంగా అభిషేకం, అర్చనలు జరిపారు. ఉత్సవ సమయంలో ప్రతిరోజు కూడా ఈ విశేష కార్యక్రమాలు వుంటాయి.
సాక్షిగణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు:
నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఈ ఉదయం సాక్షిగణపతి స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. పంచామృతాలతోనూ, ఫలోదకాలతోనూ, శుద్ధజలంతోనూ ఎంతో శాస్త్రోక్తంగా ఈ అభిషేకాన్ని నిర్వహించారు. ఉత్సవ రోజులలో ప్రతిరోజూ కూడా స్వామివారికి విశేషపూజలను చేశారు.
కాంస్య గణపతిమూర్తికి పూజాదికాలు:
ఉత్సవాలలో భాగంగా ఈ రోజు యాగశాలలో నెలకొల్పిన కాంస్య గణపతిమూర్తికి వ్రతకల్ప పూర్వకంగా పూజాదికాలను జరిపారు. ప్రతీరోజు కూడా ఉభయవేళలలో ఈ స్వామికి విశేషంగా పూజాదికాలు వుంటాయి.
వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేకపూజలు:
గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో ప్రత్యేకంగా వరసిద్ధివినాయక స్వామిని (మృత్తికాగణపతిస్వామి) నెలకొల్పారు. ఉత్సవాలలో భాగంగా ఈ వరసిద్ధి వినాయకస్వామి వారికి (మృత్తికా గణపతి వారికి) విశేషంగా పూజాదికాలు జరిపారు. ఉత్సవాలలో ప్రతిరోజు కూడా ఈ వరసిద్ధివినాయకస్వామివారికి విశేష పూజాదికాలు వుంటాయి.