శ్రీశైల దేవస్థానం;లోక కల్యాణం కోసం ప్రతీమాసంలో సంకటహర చతుర్ధి రోజున దేవస్థానం సేవగా గణపతి హోమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
సంకటహరచతుర్ధి సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి హోమం నిర్వహించారు.
ప్రతి బుధవారం, సంకటహరచవితి రోజులు పౌర్ణమి రోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారి సేవగా)
నిర్వహిస్తున్నారు.
సంకటహర చతుర్ధి సందర్భంగా ఈ రోజు ఉదయం ముందుగా సాక్షిగణపతి వారికి విశేష అభిషేకం, అర్చనలు జరిపారు.
తరువాత గణపతి హోమం జరిపారు.
వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి, హోమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని ప్రతీతి. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా అలవడుతుందని నమ్మకం.
శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరోచేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.
ఈనాటి కార్యక్రమములో శ్రీస్వామిఅమ్మవార్ల ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, యం ఉమానాగేశ్వరశాస్త్రి , సీనియర్ వేద పండితులు గంటి రాధకృష్ణశర్మ, అర్చకులు, వేదపండితులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.