శ్రీశైల దేవస్థానం:ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా శ్రీ స్వామివారి ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా 30న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేశారు.
ఉదయం గం. 11.00లకు పాత విరాళాల కేంద్రం క్యూ లైన్ నుంచి చెంచు భక్తులకు ఈ ఉచిత స్పర్శదర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతీనెలలో కూడా ఒకరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో చెంచులకు ఎంతో విశేషస్థానముందన్నారు. గిరిజన చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిడిగా భావిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన జానపద కథలు కూడా ఎంతో ప్రసిద్ధంగా ఉన్నాయన్నారు.
అదేవిధంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం సంక్రాంతి బ్రహ్మోత్సవాల సమయంలో బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతున్నదన్నారు. ఈ బ్రహ్మోత్సవ కల్యాణంలో చెంచు భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లకు నూతన వస్త్రాలు, వెదురుబియ్యం, అటవీ ఆకులతో రూపొందించిన బాసికాలు, యజ్ఞోపవీతం, అమ్మవారికి వడ్డాణం మొదలైనవాటిని సంప్రదాయబద్దంగా సమర్పిస్తారన్నారు.
అలాగే ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఇటీవల కార్తికమాసంలో జరిగిన కోటీదీపోత్సవ కార్యక్రమంలో కూడా గిరిజన చెంచు మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు.
శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు.
చెంచు భక్తులందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
