
శ్రీశైల దేవస్థానం:భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైలక్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేశామని ఈ ఓ వివరించారు దీనిపై ఈ ఓ పేర్కొన్న వివరాలు ఇవి. పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ప్రతీరోజు కార్యనిర్వహణాధికారి పలుసార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలించడం జరుగుతోంది. తదనుగుణంగా సంబంధిత విభాగాలకు కార్యనిర్వహణాధికారి ఆయా ఆదేశాలను జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూకాంప్లెక్సు, క్యూలైన్ల నిర్వహణ, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయ కేంద్రం, అన్నప్రసాదవితరణ, పారిశుద్ధ్యం, కల్యాణకట్ట, వలయ రహదారి, పాతాళగంగ మొదలైన ప్రదేశాలను తరచుగా సి.సి. కెమెరాల ద్వారా కార్యనిర్వహణాధికారి పరిశీలించడం జరుగుతోంది.
కాగా బుధవారం వేకువజామున కార్యనిర్వహణాధికారికి సుమారు గం. 2.00ల సమయంలో అకస్మాత్తుగా నిద్ర నుంచి మెలుకువ రావడంతో క్యాంపు కార్యాలయం నుంచి సి.సి. కెమెరా పుటేజీలను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని కూడా కార్యనిర్వహణాధికారి సి.సి. కెమెరా పుటేజీ ద్వారా గమనించారు.
ఆ సమయంలో అనగా సుమారు గం.2.15ని.ల సమయంలో ప్రధానాలయంలోని రత్నగర్భగణపతి స్వామి ఆలయానికి దగ్గరలో గల హుండీ వద్ద (క్లాత్ హుండీ వద్ద ) స్వామివారి ఆలయ పరిచారకుడు హెచ్. విద్యాధర్ అనుమానస్పదంగా ఉండడాన్ని కార్యనిర్వహణాధికారి గుర్తించారు.
వెంటనే వెళ్లి ఆకస్మిక తనిఖీ చేయవలసినదిగా భద్రతావిభాగపు పర్యవేక్షకులు , ఇంఛార్జి ముఖ్య భద్రతాధికారి యం.మల్లికార్జునను ఆదేశించారు. వెంటనే ముఖ్యభద్రతాధికారి ఆకస్మిక తనిఖీని చేపట్టారు.
సదరు తనిఖీలో హెచ్. విద్యాధర్, పరిచారకుడు స్వామివారి ఆలయం హుండీ నుంచి నగదును తస్కరించి, స్వామివారి ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందించే ప్రదేశంలో బీరువా వెనుక దాచినట్లుగా గుర్తించారు.
వెంటనే ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు సమక్షములో పంచనామాను నిర్వహించి తస్కరించిన నగదును పరిశీలించారు. ఈ పరిశీలనలో హెచ్. విద్యాధర్, రూ. 24,220/- నగదును తస్కరించినట్లుగా గుర్తించారు.
పరిపాలనా చర్యలలో భాగంగా ఈ విషయమై సమగ్ర విచారణకు ఆదేశించడమైనది. ప్రాథమికంగా హెచ్.విద్యాధర్, పరిచారకను విధుల నుంచి తొలగించడమైనది.
అదేవిధంగా ఈ విషయమై తగు విచారణ కోసం స్టేషన్ హౌస్ ఆఫీస్ లో ( స్థానిక పోలీస్
స్టేషన్ ) ఫిర్యాదు చేయడం కూడా జరుగుతోంది.
ప్రధానాలయంలో హుండీ నగదు తస్కరించబడడం ఎంతో తీవ్రచర్యగా దేవస్థానం పరిగణిస్తోంది. దురదృష్టకరమైన ఈ సంఘటన భక్తుల మనోభావాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే భవిష్యత్తులో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతాపరంగా మరిన్ని పకడ్బందీ చర్యలు వుంటాయని ఈ ఓ పేర్కొన్నారు.