
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన గురువారం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపారు.
రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు . ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి. ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు ప్రత్యేకం.
కుమారీ పూజ:
దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు. కుమారి పూజలో రెండుసంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు .కుమారిపూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
కూష్మాండదుర్గ అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో , నవదుర్గ అలంకారాలలో భాగంగాశ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని కూష్మాండదుర్గ స్వరూపంలో అలంకారం ప్రత్యేకం.
నవదుర్గలలో నాల్గవ రూపమైన ఈ దేవి ఎనిమిది భుజాలను కలిగి ఉంటుంది. అందుకే ఈమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. సృష్టి లేకుండా ఈ జగత్తంతా చీకటిమయంగా ఉన్నప్పుడు, ఈ కూష్మాండదుర్గ బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఈ కారణంగా ఈమె సృష్టికి ఆది స్వరూపిణిగా కూడా కీర్తించబడుతోంది.కూష్మాండదేవిని ఆరాధించడం వల్ల రోగాలన్నీ నివారించబడి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని కూడా చెప్పబడుతోంది.
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు కైలాస వాహనసేవ ప్రత్యేకం.
నంద్యాల జిల్లా:
శ్రీశైలం ,సుండిపెంట పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ IPS
నంద్యాల జిల్లాలోని మహా పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లు (శ్రీశైలం మరియు సుండిపెంట) పోలీస్ స్టేషన్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ IPS ఆకస్మికంగా తనిఖీ చేశారు.
👉ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ స్టేషన్ల రిసెప్షన్ కౌంటర్ , లాకప్ గదులు పలు రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ లో ఉంచుకోవాలని ఆదేశించారు.
👉పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులు నిర్భయంగా వారి సమస్యలను తెలియజేసే వాతావరణం కల్పించడంతోపాటు వారితో మర్యాదగా వ్యవహరించి ఓపికతో వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేయాలి.
👉శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాలు నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉండేలా మరియు గుడి పరిసరాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.
👉శ్రీశైలంక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దైవదర్శనం నిమిత్తం ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా మరియు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
👉శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వాటికి అడ్డువేయాలని ఆదేశించారు.
👉పెండింగ్ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి దర్యాప్తు విషయంలోనూ మరియు నేరస్తులను కనుగొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి.
👉శ్రీశైలం ఉత్సవాల , ఊరేగింపులు పండుగల సందర్భాలలో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చూసుకోవాలని ఆదేశించారు.
👉VIP ,VVIP లు దర్శన నిమిత్తం వచ్చినప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రోటోకాల్ నిబంధనల పాటించాలి.
👉ప్రతిరోజు విజిబుల్ పోల్ సింగ్ నిర్వహిస్తూ గంజాయి ,మద్యం అక్రమ రవాణా జరగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలి.
👉స్టేషన్ ల పరిధిలలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, అనుమానితుల మొదలగు వారిపై నిఘా ఉంచి శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా అందరూ పనిచేయాలని ఆదేశించారు.
👉అనంతరం శ్రీశైల మహా పుణ్యక్షేత్రం లో కొలువుతీరిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానం:
దేవస్థానం తరుపున దుర్గామల్లేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం శ్రీశైల దేవస్థానం తరుపున విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామికి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ మేరకు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు, తదితరులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. సమర్పణకు ముందుగా దుర్గామల్లేశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనానాయక్, ఆలయ సిబ్బంది తదితరులు ఆహ్వానం పలికారు.తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారికి, కనకదుర్గా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివారికి దసరా మహోత్సవాలలో శ్రీశైల దేవస్థానం తరపున ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోంది.
కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి యం. హరిదాసు, పర్యవేక్షకులు పి. ఉమేష్, వేదపండితులు, అర్చకులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.