×

శ్రీశైల దేవస్థానంలో కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి-జిల్లా కలెక్టర్

శ్రీశైల దేవస్థానంలో కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి-జిల్లా కలెక్టర్

కర్నూలు, డిసెంబర్ 29 :-కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీశైల దేవస్థానంలో కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం మధ్యాహ్నం శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథిగృహంలో కోవిడ్ – 19 కట్టడి చర్యల పై శ్రీశైలం దేవస్థానం అధికారులతో పాటు మెడికల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ….కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్న విషయాన్ని మరువరాదని, కొత్త వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారని, దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటించడంతో పాటు, తరచుగా చేతులను శుభ్రపరచుకోవడం, తప్పనిసరిగా మాస్క్ ధరించేలా దేవస్థానం అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం బాగా జరిగేలా చూడాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ.100 జరిమానా విధించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాల్లో మాస్కులు ధరించని వారిని అనుమతించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలకు రూ.10 నుంచి రూ.25 వేల జరిమానా విధించాలన్నారు. మాస్కు ధరించకపోతే ఆలయంలో స్వామి వారి దర్శనానికి అనుమతి ఉండదని ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కు ధరించాలని రెగ్యులర్ గా మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఉండాలని దేవస్థానం సెక్యూరిటీ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దేవాలయంలో ప్రతిచోట శానిటైజర్ లను ఏర్పాటు చేయాలన్నారు. డస్ట్ బిన్స్ కూడా ఎక్కువ ఉండేలా చూడాలని దేవస్థాన అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫీవర్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మెడికల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ ఇన్సిడెంట్ కమాండర్ లని, వారు కోవిడ్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలని  అధికారులను ఆదేశించారు. శాంపిల్స్ సేకరణ వేగవంతం చేసి వెంటనే సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించాలన్నారు.

ఈ సమీక్షలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న, కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్, శ్రీశైలం దేవస్థానం అధికారులు, రెవెన్యూ, పోలీస్, మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed