
శ్రీశైల దేవస్థానం:బ్రహ్మోత్సవాల మొదటిరోజు శనివారం సాయంకాలం అంకురార్పణ ఎంతో విశేషం. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశంలోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. దీనినే ” మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని చేసారు. ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థించారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
ధ్వజారోహణ :
బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం ఈ ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆలయప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేయడమే ఈ ధ్వజారోహణ.
ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని చిత్రీకరించారు. దీనికే నంది ధ్వజపటం అని పేరు. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన ప్రత్యేక తాడును సిద్ధం చేసారు. తరువాత నందిధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వరస్వామి సమక్షములో పూజాదికాలు చేసారు. ఈ కార్యక్రమములోనే భేరీపూజ కూడా జరిగింది.
ఈ భేరీపూజలో డోలు వాద్యానికి పూజదికాలు చేసారు. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో ఆయాదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి, రోజూ పద్దతి ప్రకారంగా వారికి నివేదన సమర్పిస్తారు. బ్రహ్మోత్సవ సమయములో దేవతలంతా క్షేత్రంలోనే వుంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి.