
శ్రీశైల దేవస్థానం:ఘంటామఠ పునర్నిర్మాణ పనుల సందర్భంగా లభించిన పలు తామ్రశాసనాల విషయ విశ్లేషణకు దేవస్థానం తగు చర్యలను చేపట్టిందని శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్.రామరావు తెలిపారు.చరిత్ర పరిశోధకులు, విషయనిపుణులతో లభించిన శాసనాలలోని విషయ అధ్యయనానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇందులో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైసూర్ విభాగం ఎపిగ్రఫీ డైరెక్టర్ డా.మునిరత్నంరెడ్డి సూచనల మేరకు ఈ రోజు (17.07.2021)న ఆ సంస్థ ఎపిగ్రఫిస్ట్ డా.మేకా వెంకటరాఘవేంద్రవర్మ, ఫోటోగ్రాఫర్ వసంత్ తదితర సిబ్బంది శ్రీశైలానికి విచ్చేసి, దేవస్థానం కార్యాలయములో తామ్రశాసనాల ఎస్టాంపేజ్ ప్రక్రియను చేపట్టారు.
ఈ ప్రక్రియలో ముందుగా ప్రత్యేక విధానం తో శాసనాలను శుభ్రపరిచి, ఆ తరువాత వాటిని శాస్త్రీయ పద్ధతిలో ఎస్టాంపేజ్ చేయడం జరుగుతోంది.
ఈ ఎస్టాంపేజ్ విధానం లో, శాస్త్రీయ విధానములో శాసనపాఠాలను కాగితముపై నకలుగా తీసి, శాసనపాఠ ప్రతిని సిద్ధం చేస్తారు .
తరువాత ఈ శాసనపాఠాన్ని విషయనిపుణులు పఠించి శాసన విషయాన్ని విశ్లేషిస్తారు.
కాగా ఘంటామఠ పునర్నిర్మాణ పనులలో – పలు దఫాలుగా మొత్తం 53 తామ్రశాసనాలు లభించాయి.
ప్రాథమికంగా ఈ శాసనాల కాలం 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ఉన్నట్లుగా గుర్తించారు.
ఈ శాసనాలు కాకతీయులు, రెడ్డిరాజులు, రేచర్ల రాజులు, గజపతులు, విజయనగర రాజుల కాలం నాటివిగా గుర్తించారు.
ఈ శాసనాలన్నీ పలు భాషలలో ఉండడం విశేషం. సంస్కృతం, తెలుగు, కన్నడ, ఒరియా భాషలలో ఈ శాసనాలు ఉన్నాయి .
అదేవిధంగా శాసనాలలో సంస్కృతం, తెలుగు, నందినాగరి, ఒరియా భాషల లిపి ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం, దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల ఆదేశాల మేరకు శ్రీశైలంలోని ప్రాచీన వారసత్వ సంపద పరిరక్షణ పట్ల ప్రత్యేక చర్యలను తీసుకుంటామన్నారు.
శ్రీశైలం ఒక దివ్యక్షేత్రంగా, పవిత్రతీర్థంగా, భక్తి – ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక, విద్య, వైద్య నిలయంగా వెలుగొందిందని చెప్పేందుకు ఈ లభించిన చారిత్రక సంపద ఎంతగానో దోహదపడుతుందన్నారు.