
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం పరిధిలోని హోటళ్ళ నిర్వాహకులతో కార్యనిర్వహణాధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం మల్లికార్జున కల్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, నంద్యాల జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్లు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ హోటళ్ళ నిర్వాహకులందరు శుచీ శుభ్రతలను పాటించాలన్నారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా వంటకాలలో తాజా కూరగాయలనే వాడాలన్నారు. భోజన అల్పాహార తయారీలో వినియోగించే పాత్రలను కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఆయా వంటపాత్రలపై తప్పనిసరిగా మూతలను పెడుతుండాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో వంట వార్పు చేయకుండా ఉండాలని సూచించారు. అవసరానికి తగినంత మాత్రమే ఆహారపదార్థాలను అందుబాటులో ఉంచాలన్నారు. నిల్వ ఉన్న ఆహారపదార్థాలను అందించరాదని అన్నారు.
ఆహారపదార్థాల తయారీలో వాడే ముడిసరుకుల నాణ్యతను, ప్రమాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించిన నియమాలకు అనుగుణంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ ఓ. అపరిశుభ్రత వాతావరణం గల ప్రాంతాలలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచరాదని అన్నారు. హోటళ్ళల్లో పనిచేసేవారందరు కూడా భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. హోటళ్ళలో 18 సంవత్సరాలలోపు బాలబాలికలను పని నిమిత్తం వినియోగించరాదన్నారు. దేవదాయచట్టం ప్రకారం నిషేధిత పదార్థాలను విక్రయించరాదని పేర్కొన్నారు.
శుచీ శుభ్రమైన వంటగదిలో నాణ్యమైన ముడిసరుకులతో రుచికరమైన ఆహారాన్ని భక్తులకు అందించడం ఎంతైనా అవసరమన్నారు ఈ ఓ. హోటళ్ళ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతతో భక్తులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. హోటళ్ళలో హానికరమైన జంక్ ఫుడ్‌ను సాధ్యమైనంత మేరకు తొలగించాలని అన్నారు. హోటళ్ళలో పనిచేసే సిబ్బంది చేతికి గ్లౌజులను, తలకు క్యాపులను తప్పనిసరిగా ధరించాలన్నారు.
తయారు చేసిన ఆహారపదార్థాలపై ఈగలు, ఇతర క్రిమీకీటకాలు వాలకుండా, దుమ్ము ధూళీ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ నెలలో రెండుసార్లు రెవెన్యూ, శానిటేషన్, ఫుడ్ఆన్ఇన్స్పెక్టర్లతో ఆహార పదార్థాలపై, హోటళ్ళ నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు చేయిస్తామన్నారు. ఈ తనిఖీలలో నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని, అంతేకాక భక్తుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా తగిన చర్యలు తీసుకోబడుతాయని పేర్కొన్నారు. అపరాధ రుసుము మూడుసార్లు దాటితె సంబంధిత హోటల్ లీజును రద్దు చేస్తామన్నారు.
అంతేకాక హోటళ్ళ లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు ఈ ఓ. ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్ వంటి వాటిని పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. టీ, కాఫీ మొదలైన వాటిని , మంచినీటిని కేవలం గాజు లేదా స్టీల్ గ్లాసులలో మాత్రమే అందించాలని అన్నారు. ఈ గ్లాసులను విధిగా వేడినీటితో శుభ్రం చేయాలన్నారు. ప్రతీ హోటల్ వద్ద తప్పనిసరిగా చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ హోటళ్ళ నిర్వాహకులందరు ఆహారపదార్థాల తయారీ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఐ.వి.ఆర్ సిస్టం ప్రకారం ప్రతి ఒక్కరు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలన్నారు. టేస్టింగ్ సాల్ట్ , ఫుడ్ కలర్సు వాడడాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. సహజ ఫుడ్ కలర్సును తక్కువ మోతాదులో వాడుకోవాలని అన్నారు. కూరగాయలను కొనుగోలు చేసిన వెంటనే శుభ్రమైన నీటితో కడిగి ఉపయోగించాలన్నారు. ప్రతీ హోటల్ యజమాని తప్పనిసరిగా ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ వారి లైసెన్సును కలిగి ఉండాలన్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు సరైన ఆహారపదార్థాలను అందించని హోటళ్ళ యజమానుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోబడుతాయన్నారు. ఎం.ఆర్.పి రేట్లను మించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారి మీద లీగల్ మెట్రాలజీ డిపార్టుమెంట్ వారు తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు డి. రాధకృష్ణ, స్థానిక హోటళ్ళ యజమానులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.