శ్రీశైల దేవస్థానం:
- ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన కార్యనిర్వహణాధికారి
- దర్శన క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశం
శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఈ ఓ ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి.11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆయా ఏర్పాట్లను గురువారం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సమీక్షించారు. దేవస్థాన వైదిక కమిటీ, ఇంజనీరింగ్ అధికారులు, పలువురు శాఖాధిపతులు, పలు విభాగాల పర్యవేక్షకులు సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధ వహించాలన్నారు.ముఖ్యంగా క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళికలను అనుసరించి బ్రహ్మోత్సవాలలో ఆయా దర్శనం క్యూలైన్లను నిర్వహించాలన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీస్ శాఖ వారి పూర్తి సహాయ సహకారాలను పొందాలన్నారు.అన్ని క్యూలైన్లు కూడా దృఢంగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ క్యూలైన్లలో కూడా అత్యవసర ద్వారాల (ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ల ) ఏర్పాట్లు ఉండాలన్నారు.అదేవిధంగా శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లన్ని కూడా ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ ప్రారంభమవుతున్నప్పటికీ, ముందస్తుగానే భక్తులు క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉన్నందున శివరాత్రి ఉత్సవ పనులను మరింత వేగవంతంగా చేయాలన్నారు ఈ ఓ. అదేవిధంగా పనులలో పూర్తి నాణ్యత ఉండాలన్నారు.అన్ని విభాగాల సిబ్బంది అందరు కూడా సమాచార వినిమయలోపం లేకుండా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.ఉత్సవాల లో ఆయా కైంకర్యాలలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు. అదేవిధంగా మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, ఆ మరునాడు జరిగే రథోత్సవం, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి తగు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.
పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీముని కొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్ల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు ఈ ఓ. అడవి మార్గంలో చేసే ఆయా ఏర్పాట్లలో అటవీశాఖ వారితో సమన్వయం చేసుకోవాలన్నారు.అన్నప్రసాదాలు శుచీ శుభ్రతలతో రుచికరంగా ఉండేవిధంగా తయారు చేయాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా తాజా కూరగాయలనే వినియోగించాలన్నారు.భక్తులరద్దీకనుగుణంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేవిధంగా పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, స్వామివార్ల ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయస్వామి, ఉమామహేశ్వరశాస్త్రి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, పి. మురళీబాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, విరాళాల సేకరణ, ప్రజాసంబంధాలు, ప్రచారం, ప్రసాదాల తయారీ, అన్నప్రసాద తయారీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.