శ్రీశైల దేవస్థానం:
• ఉగాది ఉత్సవాల ప్రారంభం కంటే ముందునుంచే భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం
• భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తవ్వాలి
• అన్నివిభాగాలు సమన్వయంతో విధులు నిర్వర్తించాలి.
• భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వుండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి.
కార్యనిర్వహణాధికారి- యం. శ్రీనివాసరావు
మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు భక్తులు ముందస్తుగానే వచ్చే అవకాశం ఉందని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులరద్దీకి తగినట్లుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని కార్యనిర్వహణాధికారి అన్ని విభాగాలను ఆదేశించారు.
ఉగాది మహోత్సవాల ఏర్పాట్లను సోమవారం కార్యనిర్వహణాధికారి సమీక్షించారు. దేవస్థానం కార్యాలయ భవనములోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలలో భక్తులందరికీ గతంలో మాదిరిగా శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థమైన ఉత్సవాలలో 10 రోజులపాటు అనగా మార్చి 6 నుంచి 15వరకు రోజుకు నాలుగు విడతలుగా స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ విషయమై కర్ణాటక రాష్ట్రంలో ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పించడం కూడా జరిగిందన్నారు ఈ ఓ.
గత నెలలో భాగల్‌కోట్ జిల్లా తేర్దాళ్ పట్టణంలో కన్నడ పాదయాత్ర భక్తబృందాలు, స్వచ్ఛంద సేవాసంస్థలతో జరిపిన సమన్వయ సమావేశంలో స్పర్శదర్శన, అలంకార దర్శన తేదీలను స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. అదేవిధంగా నిన్న జరిగిన రెండవ విడత సమన్వయ సమావేశంలో కూడా స్పర్శ, అలంకార దర్శనం తేదీలను తెలియజేయడం జరిగిందన్నారు.
భక్తులు స్పర్శదర్శనం కోసమై ఉత్సవాలకంటే ముందస్తుగానే క్షేత్రాన్ని చేరుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా గత సంవత్సరం కంటే కూడా భక్తులసంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందన్నారు.
ఉగాది ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 28వ తేదీన జిల్లా కలెక్టర్ వారు జిల్లాస్థాయిలో ఆయా శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లుగా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ తదితర విభాగాలను కూడా ఆదేశించారు ఈ ఓ . అదేవిధంగా ఆయా పనులలో పూర్తి నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఉత్సవాలకు కాలిబాట మార్గములో అనగా వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి వస్తారని, కావున కాలిబాట మార్గములో తగిన సదుపాయాలను కల్పించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా కాలిబాటలో భక్తులకు మంచినీటిని అందించడములో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసినట్లుగానే కైలాసద్వారం వద్ద కూడా అదనపు మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా కైలాసద్వారం, భీమునికొలను మార్గములో సింటెక్సు ట్యాంకులను నెలకొల్పి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ. మహాశివరాత్రిలో వేయబడ్డ మంచినీటి కుళాయిలన్నింటినీ కూడా ఉగాది ఉత్సవాలలో కూడా వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం మరియు కైలాద్వారంతో పాటు క్షేత్రంలో భక్తులు బసచేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా దర్శనం క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీటి సరఫరా చేయాలన్నారు. కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల మరియు శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉత్సవాలలో క్షేత్రపరిధిలో కూడా పలుచోట్ల భక్తులు అన్నదానం చేస్తుంటారని, అన్నదాన బృందాలన్నింటికి దేవస్థానం తరుపున ఆయా ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ , అన్నప్రసాద వితరణ విభాగాలను ఆదేశించారు ఈ ఓ. ముఖ్యంగా అన్నదాన ప్రాంతాలలో పైప్ పెండాల్స్, లైటింగు ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాటు ఉండాలన్నారు.
క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతర మంచినీరు, అల్పాహారాన్ని అందజేసే ఏర్పాట్లు చేయాలని అన్నదాన, ఆలయ , క్యూలైన్ల నిర్వహణా విభాగాలను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. ఎండతాకిడి అధికంగా ఉన్నందున క్యూకాంప్లెక్సు మరియు క్యూలైన్లలో అవసరమైనచోట్ల కూలర్లను కూడా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లు చేసినట్లుగానే భక్తులు సేద తీరేందుకు ఉగాది మహోత్సవాలలో కూడా పలు చోట్ల పైప్పెండాల్స్ ( చలువ పందిర్లు) మొదలైనవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలలో ఈ ఏర్పాట్లు ఉండాలన్నారు. చలువపందిర్లు వేయబడిన అన్ని ప్రదేశాలలో కూడా తగినంత విద్యుద్దీకరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. అదేవిధంగా మంచినీరు కూడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని క్షేత్రపరిధిలోని పలు ఆరుబయలు ప్రదేశాలలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. దేవస్థానం అతిథిగృహాల ప్రాంగణం, ఉద్యానవనాలు, తాత్కాలిక వసతిప్రదేశాలు మొదలైన చోట్ల వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ తాత్కాలిక లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆలయంలో స్వచ్ఛంద సేవలను అందించే సేవకులకు నిర్ణీత వేళలలో షిఫ్టులను నిర్ణయించి వీరికి తదనుగుణంగా తాత్కాలిక గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు. క్షేత్రపరిధిలోనూ మరియు కైలాసద్వారం మొదలైనచోట్ల జిల్లా వైద్యశాఖ సహకారముతో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యవిభాగాన్ని ఆదేశించారు.
పారిశుద్ధ్య నిర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో చేపట్టినట్లుగానే తగు కార్యాచరణ ప్రణాళికలతో చర్యలు చేపట్టాలన్నారు ఈ ఓ . ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
క్షేత్రపరిధిలో పలుచోట్ల గల శాశ్వతమరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటితో పాటు పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల కూడా కన్నడ భాషలో విస్తృతంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ మరియు శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో బహిరంగ మలమూత్రవిసర్జనను నిషేధించిన విషయమై సూచిక బోర్డుల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.
ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కన్నడ భక్తి సంగీతవిభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు, కన్నడ భక్తి నాటకాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల అధికారి వారిని ఆదేశించారు.
మహాశివరాత్రికి ఏర్పాటు చేసినట్లుగానే భక్తుల సౌకర్యార్థం అవసరమైన మేరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.
ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థమై నందిసర్కిల్, కల్యాణకట్ట, పాతాళగంగమెట్లమార్గం, సాక్షిగణపతి, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, సెంట్రల్ పార్కింగ్, దేవస్థానం వైద్యశాల మొదలైన చోట్ల తాత్కాలిక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమాచార కేంద్రాలలో కన్నడ ప్రాంతాల స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో భక్తులకు తగు సమాచారాన్ని అందజేయాలన్నారు.
