×

భక్తులను అలరించేందుకు కన్నడ భక్తి సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలుండాలి-ఈ ఓ

భక్తులను అలరించేందుకు కన్నడ భక్తి సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలుండాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఏప్రియల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాల  నిర్వహణకు సంబంధించిన ఆయా ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో జరిగిన  సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి, అన్ని విభాగాల అధిపతులు (యూనిట్ ఆఫీసర్స్) పర్యవేక్షకులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ఎటువంటిలోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉండాలన్నారు.ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా జరగాలని ఆదేశించారు. అదేవిధంగా పూజాదికాలు అన్నీ నిర్దేశించిన  సమాయానికంతా ప్రారంభించాలని అన్నారు.ఉత్సవాలకు కాలిబాట మార్గములోని వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా భక్తులు క్షేత్రానికి వస్తారని చెబుతూ, కాలిబాట మార్గములో ఆయా ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సరఫరా చేసినట్లుగానే ఉగాది ఉత్సవాలలో కూడా కాలిబాట మార్గములోని నాగలూటి, దామెర్లకుంట, పెద్ద చెరువు మొదలైన చోట్లకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తుండాలన్నారు. అదేవిధంగా కైలాసద్వారం వద్ద కూడా అదనపు ట్యాంకర్లను ఏర్పాటు చేయాలన్నారు. కైలాసద్వారం – భీముని కొలను మెట్లమార్గములో కూడా సింటెక్సు ట్యాంకులను ఏర్పాటు చేసి నిరంతరం మంచినీటి సరఫరా ఉండాలన్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకనుగుణంగా నీటిసరఫరాకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. మహాశివరాత్రిలో వేసిన మంచినీటి కుళాయిలన్నింటిని ఉగాది ఉత్సవాలలో కూడా వినియోగించుకునే ఏర్పాట్లు ఉండాలన్నారు.అదేవిధంగా క్యూలైన్లలో , క్యూ కాంప్లెక్సులో నిరంతరం మంచినీరు అందజేస్తుండాలన్నారు. మంచినీటితో పాటు మజ్జిగ, బిస్కెట్లు, అల్పహారాన్ని కూడా అందిస్తుండాలన్నారు.

ఎండతీవ్రత కారణంగా క్యూకాంప్లెక్సులో అవసరం మేరకు కూలర్లను ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ.ఉత్సవాల సందర్భంగా క్షేత్రపరిధిలో పలుచోట్ల భక్త బృందాల వారు అన్నదానాలు చేస్తుంటారని, అన్నదాన బృందాలన్నింటికి దేవస్థానం తరుపున ఆయా ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ , అన్నప్రసాద వితరణ విభాగాల వారిని ఆదేశించారు.

ముఖ్యంగా అన్నదానాలు చేసే ప్రదేశాలలో పైప్ పెండాల్స్, లైటింగు ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాట్లు ఉండాలన్నారు.భక్తులు సేద తీరేందుకు పలుచోట్ల వేసిన చలువపందిర్ల వద్ద ( పైప్ పెండాల్స్ వద్ద ) తగినంత లైటింగ్ ఏర్పాట్లు, మంచినీటిసరఫరా ఉండాలన్నారు.దేవస్థానం అతిథిగృహ ప్రాంగణాలు, ఉద్యానవనాలు, తాత్కాలి వసతి ప్రదేశాలు మొదలైన అన్ని చోట్ల కూడా వీలైనంత ఎక్కువ విస్తీర్ణములో లైటింగు ఏర్పాట్లు ఉండాలన్నారు.

ఆలయంలో స్వచ్ఛంద సేవలు అందించే సేవకులకు నిర్ణీత వేళలో షిఫ్టులను నిర్ణయించి వారికి తదనుగుణంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.క్షేత్రపరిధిలో, కైలాసద్వారం వద్ద జిల్లా వైద్యశాఖ సహకారంతో తాత్కాలిక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యవిభాగపు సహాయ కార్యనిర్వహణాధికారివారిని ఆదేశించారు.

వైద్యశాలలో కాలినడకన వచ్చే భక్తులకు బొబ్బల నుండి ఉపశమనం కల్పించేందుకు పూత మందులు (ఆయింట్ మెంట్ మందు) మొదలైన వాటితో పాటు అవసరమైన సూది మందులను, ఒళ్ళునొప్పులకు సంబంధించిన మందులను కూడా సిద్ధంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.పారిశుద్ధ్య పనులకు గాను దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటుకు  పారిశుద్ధ్యపు విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారివారిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెత్తచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమయానుసారంగా క్యూలైన్లు , క్యూకాంప్లెక్సులో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి శుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు.క్షేత్రపరిధిలో పలుచోట్ల గల శాశ్వతమరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. మరుగుదొడ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.

అదేవిధంగా స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో బహిరంగ మలమూత్రవిసర్జనను నిషేధించిన విషయమై సూచికబోర్డుల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల కూడా కన్నడభాషలో విస్తృతంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ , శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు కన్నడ భక్తి సంగీతవిభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు, కన్నడ భక్తినాటకాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు.

ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థమై నందిసర్కిల్, కల్యాణకట్ట, పాతాళగంగమెట్లమార్గం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, యజ్ఞవాటిక, దేవస్థానం వైద్యశాల మొదలైన చోట్ల తాత్కాలిక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ ఓ . ఈ సమాచార కేంద్రాలలో కన్నడ ప్రాంతాల స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో భక్తులకు తగు సమాచారాన్ని అందజేయాలన్నారు.

print

Post Comment

You May Have Missed