
శ్రీశైల దేవస్థానం: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదిముర్ము ఈ నెల 26వ తేదిన శ్రీశైలక్షేత్రాన్ని సందర్శిస్తున్న సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఆ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని విభాగాలు కూడా సమన్వయంతో పనిచేసి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.ఆయా ఏర్పాట్లపై అన్ని విభాగాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కార్యనిర్వహణాధికారి దిశానిర్ధేశం చేసారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గంగాధరమండపం, ఆలయం, గంగాపదన్ ఎదురుగా పర్యాటక సంస్థ వారి యాత్రిక సదుపాయ కేంద్రం మొదలైన అన్ని చోట్ల కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని ఆదేశించారు.క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలని, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. దేవస్థానం పరిధిలోని రహదారులలో గుంతలు లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేవిధంగా తగు జాగ్రత్తలు చేపట్టాలని కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా వచ్చే ఉన్నతాధికారులకు, జిల్లా అధికారులకు తదితర సిబ్బందికి తగు విధమైన వసతి కల్పించాలని వసతి విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్ ను ఆదేశించారు. ఆలయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా దర్శనం, పూజాదికాల ఏర్పాట్లు ఉండాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎప్పటి వలె ఆలయంలో తగు విధంగా పుష్పాలంకరణను చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.అవసరమైనచోట్ల మరిన్ని పూలకుండీలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.