అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు వహించాలి- ఈఓ

 శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపధ్యంలో శుక్రవారం  కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావు  ఆయా ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

పాతాళగంగ, దేవస్థానం డార్మిటరీలు, కల్యాణకట్ట, శివదీక్షా శిబిరాలు, పలుచోట్ల గల శౌచాలయాలు, మల్లికార్జునసదన్ వసతి గృహం తదితర ప్రదేశాలను కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.  ముందుగా పాతాళగంగ మెట్లమార్గాన్నంతా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి పాతాళ గంగమార్గములో మెట్లమార్గములో అవసరమైనచోట్ల మెట్లకు తగు మరమ్మతులు చేయాలన్నారు. ఉత్సవాల సమయములో ఈ మెట్లమార్గములో అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

తరువాత పాతాళగంగలో బ్యారికేడింగ్, జల్లుస్నానాలు (షవర్బత్), మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, శౌచాలయాలు మొదలైనవాటిని ఈ ఓ  పరిశీలించారు. ఉత్సవాల సమయములో పాతాళగంగ స్నానఘట్టాల వద్ద, స్నానఘట్టాల పరిసరాలలో కూడా అవసరమైన అదనపు విద్యుద్దీపాల ఏర్పాట్లు ఉండాలన్నారు.పాతాళగంగలో స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడింగు మరింత ధృడంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.పాతాళగంగ ఎగువభాగంలో జల్లుస్నానానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఉత్సవాల సమయములో రద్దీ ఎక్కువగా ఉంటున్న కారణంగా పాతాళగంగ వద్ద తగు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు ఈ ఓ. ఈ విషయమై పోలీస్ అధికారుల సమన్వయంతో ఆయా భద్రతా చర్యలు చేపట్టాలని భద్రతా విభాగపు పర్యవేక్షకులను ఆదేశించారు. పాతాళగంగ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.పాతాళగంగలో పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగిస్తుండాలన్నారు.భక్తులకు అవగాహన కలిగేందుకు పాతాళగంగలో మరిన్ని హెచ్చరిక బోర్డులు, సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

తరువాత పాతాళగంగమార్గంలోని దేవస్థానం డార్మిటరీలను ఈ ఓ  పరిశీలిస్తూ అన్ని డార్మిటరీలలో విద్యుద్దీపాలు, ఫ్యాన్లు సజావుగా పనిచేసేవిధంగా పర్యవేక్షిస్తుండాలన్నారు. ఈ సందర్భంగా డార్మిటరీల వద్ద ఏర్పాటు చేసిన శౌచాలయాలను పరిశీలించారు. అన్ని శౌచాలయాల వద్ద కూడా సజావుగా నీటిసరఫరా ఉండాలన్నారు. శౌచాలయాలన్నింటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేవిధంగా తగు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.దేవస్థానం డార్మిటరీ ప్రాంగణములో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.అనంతరం కల్యాణకట్టను పరిశీలన సందర్భంగా మాట్లాడుతూ కేశఖండన సమయములో శుచీ శుభ్రతలను పాటించాలని కల్యాణకట్ట సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు కల్యాణకట్టను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.కేశఖండనానికి వచ్చిన భక్తులు అధికసమయం వేచివుండకుండా ఉండేవిధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని అన్నారు.ముఖ్యంగా కల్యాణకట్టలో కూడా జల్లుస్నానం ఏర్పాట్లు ఉండాలన్నారు. అదేవిధంగా సర్వతోభద్ర వనం ఎదురుగా గల జల్లు స్నానానికి ఏర్పాట్లు చేయాలన్నారు. జల్లు స్నానం పైపులు వీలైనంత ఎక్కువగా

ఉండాలన్నారు.

తరువాత శివదీక్షా శిబిరాలను పరిశీలించారు ఈ ఓ. శివదీక్షా శిబిరాల ప్రాంగణములో గత సంవత్సరము కంటే ఎక్కువ విస్తీర్ణములో పైప్పెండాల్స్ వేయాలన్నారు. అదేవిధంగా అక్కడ దీక్షా భక్తులు స్నానాలాచరించేవిధంగా మరిన్ని కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. శివదీక్షా శిబిరాలలోని అన్ని శౌచాలయాలు కూడా వినియోగంలో ఉండేవిధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులు డి. రాధాకృష్ణ, భద్రతా విభాగపు పర్యవేక్షకులు సి. మధుసూదన్రెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.