సిద్దం చేసిన ప్రణాళికను అనుసరించి క్యూలైన్లను నిర్వహించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:సిద్దం చేసిన ప్రణాళికను అనుసరించి క్యూలైన్లను నిర్వహించాలని ఈ ఓ సూచించారు.  ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం  సాయంకాలం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాలు, క్యూలైన్లు, పలు క్యూలు, పార్కింగు ప్రదేశాలు మొదలైనవాటిని పరిశీలించారు.

లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాల పరిశీలన:

ముందుగా అన్న ప్రసాద భవన ప్రాంగణంలో లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాలను ఈ ఓ  పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న 15 కేంద్రాలతో పాటు అదనంగా మరో 8 కౌంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వీటిలో దివ్యాంగులకు , వృద్ధులకు (60 సంవత్సరాలు పైబడినవారికి) వేరువేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద తగినన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.ముఖ్యంగా భక్తులు కోరినన్ని లడ్డు ప్రసాదాలు ఇచ్చేందుకు అవసరమైన మేరకు ప్రసాదాలను సిద్ధంగా ఉంచాలన్నారు.లడ్డుప్రసాద తయారీలో కూడా ఎప్పటికప్పుడు పూర్తి శుచీ శుభ్రతలను పాటిస్తుండాలని సంబంధికులను ఆదేశించారు. అదేవిధంగా ఏ మాత్రం కూడా నాణ్యత తగ్గకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.అదేవిధంగా లడ్డుప్రసాదాల విక్రయకేంద్ర ప్రాంగణంలో బండ పరుపు ఎటువంటి పగుళ్ళు లేకుండా తగిన మరమ్మతులు చేయాలన్నారు.

క్యూకాంప్లెక్స్ పరిశీలన :

క్యూకాంప్లెక్సు పరిశీలన సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ రద్దీ సమయాలలో క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకు గాను తగిన స్థాయిలో సెక్యూరిటి సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సిద్దం చేసిన ప్రణాళికను అనుసరించి క్యూలైన్లను నిర్వహించాలన్నారు.

క్యూకాంప్లెక్స్ , క్యూలైన్లలో నిర్దిష్ట ప్రదేశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ పాయింటులను నీటిసరఫరా సజావుగా ఉండాలన్నారు.

 శివదీక్షా క్యూలైన్ల లో మరిన్ని  వాటర్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. క్యూకాంప్లెక్స్లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా చర్యలు చేపట్టలన్నారు.భక్తులు చేతులు శుభ్రపరుచుకునేందుకు వీలుగా వాష్ బేసిన్ల వద్ద హ్యాండ్ వాష్ ద్రావణాన్ని కూడా అందుబాటులో ఉంచాలన్నారు.

కొబ్బరికాయల గోడౌన్ పరిశీలన :

కొబ్బరికాయల గోడౌన్ పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ప్రస్తుత విక్రయ కేంద్రంతో పాటు అదనంగా మరో రెండు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ అదనపు కౌంటర్లలో పెద్దసత్రం ముందుభాగంలో ఒక కౌంటరును, రథశాల ఎదురుగా మరో కౌంటరును ఏర్పాటు చేయాలన్నారు.

 భక్తులరద్దీకనుగుణంగా తగినంత స్టాకును ముందస్తుగానే సిద్ధంగా ఉంచుకోవాలని కొబ్బరికాయల గోడౌన్ అధికారులను ఆదేశించారు.

 సరఫరాను పొందేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయల నాణ్యతను పరిశీలించాలన్నారు. ఎట్టిపరిస్థితులలో కూడా నాణ్యత విషయములో రాజీపడకూడదన్నారు.

పార్కింగు ప్రదేశాల పరిశీలన :

పార్కింగు ప్రదేశాల పరిశీలనలో భాగంగా ఈ ఓ  మాట్లాడుతూ పార్కింగ్ ప్రదేశాలు, వాటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేందుకుగాను అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలన్నారు.అన్ని పార్కింగ్ ప్రదేశాలలో కూడా మంచినీటి సదుపాయం, తగినంత విద్యుద్దీకరణ ఉండాలన్నారు.  వీలైనంత మేరకు అన్ని ప్రదేశాలలో కూడా తాత్కాలిక శౌచాలయాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.

 ముఖ్యమైన పార్కింగ్ ప్రదేశాల వద్ద కూడా సమాచార కేంద్రాలను (May I Help You Centers) ఏర్పాటు చేయాలన్నారు. ఆయా సమాచార కేంద్రాలలో సమాచార కరపత్రాలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి.మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు , ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్  పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.