శ్రీశైల దేవస్థానం:* క్యూలైన్ల నిర్వహణలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని ఆదేశం
*క్యూలైన్లలో తొక్కిసలాటలు జరగకుండా వుండేందుకు తగు ముందస్తు జాగ్రత్తలు
*క్యూకాంప్లెక్సులో దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేత, వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు*
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపధ్యంలో భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలసి క్యూలైన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం శీఘ్రదర్శనం అతిశీఘ్రదర్శనం టికెట్ల కౌంటర్లను వేరువేరుచోట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏర్పాటువలన కౌంటర్ల వద్ద క్యూలైన్లు సజావుగా నిర్వహించవచ్చునని అన్నారు.
ప్రస్తుత శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్లను ( విరాళాల సేకరణ కౌంటర్ ప్రక్కన గల కౌంటర్లు) అతిశీఘ్రదర్శనం (రూ. 500/-ల టికెట్టు ) కౌంటర్లుగా వినియోగించాలన్నారు.
ఇక శీఘ్రదర్శనానికి ( రూ.200/-ల టికెట్లు) క్యాంటిన్ భవనం తొలగించిన ప్రదేశంలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
గత సంవత్సరం మాదిరే ఉచిత దర్శనం క్యూలైన్లను రథశాల నుంచి ప్రారంభించాలన్నారు. ఈ సంవత్సరం అదనపు క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు.
వృద్ధులకు, దివ్యాంగులకు , చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్లు ఉండాలన్నారు. ఈ ప్రత్యేక క్యూలైనును ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం ముందుభాగం నుంచి ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థమై విరాళాల సేకరణ వద్ద చక్రాల కుర్చీలను ( వీల్చైర్) తగిన సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలన్నారు.
క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను తగినస్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని , శివసేవకులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయములో నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా వెడల్పుగా ఉన్న క్యూలైన్ల మధ్యలో రోడ్లైన్లను అనగా తాళ్ళతో తాత్కాలిక లైన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు , అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేసిన అత్యవసర గేట్లు ( ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు) సజావుగా పనిచేసేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ అత్యవసర లైన్లను సులభంగా గుర్తించేందుకు వీలుగా వాటికి ప్రత్యేకంగా ఎర్రరంగును వేయాలన్నారు.
క్యూకాంప్లెక్స్లోనూ నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు మొదలైనవాటిని అందజేస్తుండాలన్నారు.
క్యూకాంప్లెక్స్ లోనూ ,క్యూలైన్లలో గల మంచినీటి కుళాయిలు, వాష్షిన్లు అన్నీ కూడా వినియోగానికి అందుబాటులో ఉండాలన్నారు. అన్ని వాటరు పాయింట్లకు కూడా నిరంతర నీటి సరఫరా ఉండాలన్నారు.
భక్తులు ఆయా క్యూలైన్లను గుర్తించేందుకు వీలుగా అన్ని క్యూలైన్ల వద్ద కూడా అవసరమైన మేరకు సూచిక బోర్డులు ఉండాలన్నారు.
క్యూకాంప్లెక్స్ లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. ఎప్పటికప్పుడు వీటిని శుభ్రపరుస్తుండాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా చర్యలు చేపట్టలన్నారు.
కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో క్యూకాంప్లెక్స్ నందు మొత్తం 16 కంపార్టుమెంట్ల ద్వారా ఉచిత దర్శనానికి అవకాశం కలిస్తారు. అదేవిధంగా 5 కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను శీఘ్రదర్శనానికి ( రూ.200/- ల టికెట్లు) అనుమతిస్తారు.
తక్కిన రెండు కంపార్టుమెంట్ల ద్వారా అతిశీఘ్రదర్శనానికి ( రూ. 500/-ల టికెట్టు) అనుమతిస్తారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్ , సివిల్ విభాగపు ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీ ఇంజనీరు పి. చంద్రశేఖరశాస్త్రి, భద్రతా విభాగపు పర్యవేక్షకులు సి. మధుసూదనరెడ్డి, క్యూలైన్ల విభాగపు పర్యవేక్షకులు పి. హిమబిందు, ఎం. మల్లికార్జున, సంబంధిత సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.