
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం ఈ ఓ లవన్న క్యూలైన్లను, క్షేత్రపరిధిలోని శౌచాలయాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇప్పటికే గత నెలలో 11వ తేదీన కార్యనిర్వహణాధికారి క్యూలైన్లు, మొదలైనవాటిని పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేసారు.ఈ ఏర్పాట్ల తనిఖీలో భాగంగా ఈ రోజు క్యూలైన్లు ఆలయ ప్రాంగణములోని ఏర్పాట్లు మొదలైనవాటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను తగినస్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయం లో నిర్థిష్టమైన ప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.క్యూకాంప్లెక్స్ లోనూ నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు మొదలైనవాటిని అందజేస్తుండాలన్నారు. క్యూలైన్ లోని నిర్థిష్ట ప్రదేశాలలో ఏర్పాటు చేసిన వాటర్ పాయింట్లకు నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.
క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు, అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేసిన అత్యవసర గేట్లు ( ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు) సజావుగా పనిచేసేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.క్యూకాంప్లెక్స్ లోని మంచినీటి కుళాయిలు, వాష్బాషిన్లు అన్నీ కూడా వినియోగానికి అందుబాటులో ఉండాలన్నారు.అన్నీ క్యూలైన్ల ప్రారంభంలో కూడా అవసరమైన మేరకు సూచిక బోర్డులు ఉండాలన్నారు.
అదేవిధంగా క్యూకాంప్లెక్స్ లోని, క్షేత్రపరిధిలోని శౌచాలయాల శుభ్రతపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. అన్నీ శౌచాలయాలలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఏర్పాటు ఉండాలన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు వేరు వేరు క్యూలైన్ల ద్వారా దర్శనాలను ఏర్పాట్లు చేస్తారు . ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం (రూ.200/- తో) అతిశీఘ్రదర్శనం ( రూ. 500/-తో) క్యూలైన్లను ఏర్పాటు చేస్తారు.
వీటితో పాటుగా పాదయాత్రతో వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం ఏర్పాటు చేస్తారు. ఈ పాదయాత్ర భక్తులకు అటవీమార్గమధ్యములోనే కంకణాలను వేస్తారు. కంకణాలు ధరించిన పాదయాత్ర భక్తులనే ప్రత్యేక క్యూలైన్ ద్వారా పంపుతారు.
అదేవిధంగా శివదీక్షా భక్తులకు చంద్రవతి కల్యాణమండపం నుంచి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తారు.
క్యూకాంప్లెక్స్ లో మొత్తం 16 కంపార్టుమెంట్ల ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా 6 కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను శీఘ్రదర్శనం ( రూ.200/-లు) ద్వారా భక్తులను అనుమతిస్తారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, పర్యవేక్షకులు కె. అయ్యన్న, అసిస్టెంట్ ఇంజనీరు భవన్ , ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.