గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం- సీతక్క

హైదరాబాద్, జూన్ 21: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో కలిసి శుక్రవారం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని Ground Floor, 3rd Floor లలో  రెండు మహిళా శక్తి క్యాంటిన్లను ప్రారంభించారు.

మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా ఎదగాలని, దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి ఆకాంక్షించారు. ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా మహిళా శక్తి క్యాంటిన్లు నాణ్యతకు మారుపేరుగా నిలవాలని పల్లె రుచులు, ఇప్ప పువ్వు లడ్డులు, నన్నారి వంటి సాంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో 151 మహిళా శక్తి క్యాంటిన్లు ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.

స్థానికంగా లభ్యమయ్యే వనరులు, వస్తువుల ఆధారంగా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా  మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ రూపొందించి  రానున్న  అయిదేళ్లలో మహిళ సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామని సీతక్క పేర్కొన్నారు.

రాష్ట్రంలో మహిళా స్వయంసహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు బిజినెస్ మోడల్స్ ను గుర్తించిందని అన్నారు. వాటిలో ప్రధానమైన ఆధార్ కేంద్రాలు, మీ – సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, వడ్డీలేని రుణ సౌకర్యం కూడా కల్పిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతిరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ముఖ్యమంత్రి కార్యదర్శులు మానిక్ రాజ్ , చంద్రశేఖర్ రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాల్ రావు, సెర్ప్ అధికారులు  నర్సింహారెడ్డి, సునిత రెడ్డి,రజిత తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.