అభివృద్ధికి విద్యను ఆయుధంగా మార్చుకోవాలి

హైదరాబాద్:  విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని మహాత్మా జ్యోతిబా ఫూలే చాటి చెప్పారని ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 196వ జయంతి సందర్భంగా  సోమవారం  రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  రవీంద్రభారతిలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.  పూలే  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ హాజరయ్యారు. బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్  అధ్యక్షత వహించగా బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులకోసం జీవితాన్ని ధారపోసిన పూలే విద్యను ఆయుధంగా చేసుకుని  పోరాడిన దార్శనికుడని వకుళాభరణం కృష్ణమోహన్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేత్రుత్వంలో ప్రభుత్వం పూలే సిద్దాంతాల కనుగుణంగా పనిచేస్తుందని బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పూలే జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు వెనుకబడిన వర్గాలకు విద్యను అందించేందుకు వీలుగా ఆ మహనీయుడి పేరు మీద  బీసీ గురుకులాలు, విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రతి బిసీ విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు ఉద్యోగాలు సాధించేలా బిసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 16న నిర్వహించే ఆన్ లైన్ పరీక్షకు బిసీ విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. బిసీల ఐక్యత కోసం  ఫూలే తన జీవితాన్ని ధారపోశారని సమాన హక్కులు సాధిస్తూ ఆయన ఆశయాలను నిజం చేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.

వెనుకబడిన వర్గాల వారికి విద్యను అందిస్తున్న మన రాష్ట్రంలోని బిసీ గురుకులాలు దేశంలో మరెక్కడా లేవని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు.  గురుకులంలో చదువుకుని సివిల్ సర్వీస్ లో అత్యున్నత ర్యాంకు సాధించిన  బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం  బిసి విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని  అన్నారు.

గౌరవ అతిథులుగా బిసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, బిసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బిసి ఫెడరేషన్ చైర్మన్లు చంద్రశేఖర్,బాలాచారి, ఉదయ్ కుమార్ , విమల ,  ఆనంద్ కుమార్,  నీలా వెంకటేష్,  రాజేందర్,  బడేసాబ్,  బిసీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ బిసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.