ఎన్నో అద్భుత కార్యక్రమాలు-సిబ్బంది అంతా సహకారం-బదిలీపై వెళుతున్నా,సదా కృతజ్ఞతలు-కె.ఎస్.రామరావు

శ్రీశైల దేవస్థానం:  శ్రీశైల దేవస్థానం  కార్యనిర్వహణాధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న  కె.ఎస్.  రామరావు ఈ రోజు (26.08.2021) దేవస్థానం ఉద్యోగులతో సమావేశమయ్యారు.

దేవస్థాన పరిపాలనా భవనం లో జరిగిన ఈ సమావేశానికి అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, వివిధ విభాగాల సిబ్బంది , అర్చకస్వాములు, వేదపండితులు హాజరయ్యారు.

 కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాలంలో దేవస్థానం సిబ్బంది అందరు తమకు ఎంతగానో సహకరించారని చెబుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విధినిర్వహణలో తమకు సహకరించినట్లుగానే రాబోవు నూతన కార్యనిర్వహణాధికారికి కూడా సహకరించి ఉద్యోగలందరు కూడా దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

గత రెండు సంవత్సరాల కాలంలో దేవస్థానం లో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టి  విజయవంతం అవ్వడం లో దేవస్థానం  ఉద్యోగులంరి సహకారం  ఎంతగానో ఉందన్నారు.

లోకకల్యాణం కోసం ముఖ్యంగా కరోనా వ్యాప్తి అరికట్టి  భక్తులు   ఆరోగ్యాన్ని పొంది, సుంఖసంతోషాలతో ఉండాలన్న సంకల్పముతో 41 రోజుల పాటు మహామృత్యుంజయ పాశుపతహోమం, 21 రోజులపాటు సీతలాదేవి హోమాలు జరిపించామన్నారు.

కరోనా వ్యాప్తి సయం ములో కూడా అర్చకస్వాములు, ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించారన్నారు.

 శ్రీశైల క్షేత్రపరిధిలో కరోనా వ్యాప్తి నివారించడంలో కూడా ఉద్యోగులు తమవంతు పాత్రను పోషించారన్నారు.

 శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు తమ గోత్రనామాలతో ఆయా సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా శ్రీశైలపరోక్షసేవను ప్రవేశపెట్టామన్నారు.ఈ పరోక్షసేవకు భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.   ఆలయ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా ఆలయంలోకి ప్రవేశించే వారంతా విభూతిని ధరించే విభూతిధారణ కార్యక్రమాన్ని ప్రారంభిన్చామన్నారు.

ఇక ఆలయాన్ని దర్శించే భక్తులందరికి కూడా శ్రీస్వామివార్ల ప్రసాదం అందించాలనే సంకల్పముతో నిరంతర ప్రసాదవితరణను చేపట్టామన్నారు.

శ్రీశైల సంస్కృతి సంప్రదాయాలతో చెంచుభక్తులకు గల స్థానాన్ని,  హిందూధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడాలలో ధర్మప్రచార కార్యక్రమ నిర్వహణకుగాను ‘ మా స్వామి.. మల్లన్న’ కార్యక్రమాన్ని ప్రారంభిన్చామన్నారు.

 సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా • ఆహ్వానించామన్నారు.

వైదిక సంస్కృతి సంప్రదాయాలలో గోవుకు గల విశిష్టస్థానాన్ని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే భావనతో గో ఉత్పత్తుల తయారీ,  విక్రయాలను ప్రారంభిన్చామన్నారు.

శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేందుకు నిత్యకళారాధన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

ఇక స్థానికులు, యాత్రికుల సౌకర్యార్థం నిరంతర వైద్యసేవలను ప్రవేశపెట్టామన్నారు . గతంలో రోజుకు 8గంటలు మాత్రమే దేవస్థాన వైద్యశాలలో సేవలు  అందే వని, అయితే నిరంతర వైద్యసేవల విధానం లో 24గంటలపాటు వైద్యసేవలు అందే సదుపాయం కల్పించామన్నారు.

సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రములో మొట్టమొదటిసారిగా వేదసభను నిర్వహించామని,దసరా మహోత్సవాలలోనూ, సంక్రాంతి బ్రహ్మోత్సవాలలోనూ ఈ వేదసభ జరిగాయన్నారు.

అదేవిధంగా భక్తులలో దేవతా వృక్షాలపై అవగాహన కల్పించేందుకు నక్షత్రవనం పనులు ప్రారంభించామన్నారు.

సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగానే రథసప్తమిరోజున సూర్యనమస్కార కార్యక్రమం జరిపామన్నారు.

ఇంకా శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో వివాహం చేసుకుని, పెళ్ళి దుస్తులతో ఆలయానికి విచ్చేసిన నూతన వధూవరులను దేవస్థానం తరుపున ఉచితంగా ఆశీర్వదించేందుకు సౌభాగ్యమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

శ్రీశైలక్షేత్ర చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా పంచమఠాల పునరుద్ధరణను వేగవంతం చేశామన్నారు.

ఘంటామఠ పునర్నిర్మాణ పనులలో 53 ప్రాచీన తామ్రశాసనాలు లభించడం ఎంతో విశేషమన్నారు. శ్రీశైలక్షేత్రములో ప్రాచీన చిత్రలిపిని గుర్తిన్చినట్లు చెప్పారు.

శ్రీశైలం ఒక దివ్యక్షేత్రంగా, పవిత్రతీర్థంగా, భక్తి – ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక, విద్య, వైద్య నిలయంగా వెలుగొందిందని చెప్పేందుకు ఈ లభించిన చారిత్రకసంపద ఎంతగానో దోహదపడుతుందన్నారు.

శ్రీశైలక్షేత్ర స్థలపురాణాన్ని తెలియజెప్పేందుకు వీలుగా ప్రసాద్ స్కీమ్ కింద చేపట్టిన  సౌండ్ అండ్ లైట్ షో పనులను పూర్తి చేశామన్నారు.

 భక్తుల సౌకర్యాల కల్పనకు సాంకేతికను వినియోగించుకునేందుకు వీలుగా దేవస్థానం వెబ్ సైట్ పనుల ఆధునీకరణ చేపట్టామన్నారు.ఆభివృద్ధిలో భాగంగా దాతల సహకారముతో అమ్మవారి యాగశాల నిర్మాణం ప్రారంభించామన్నారు . దాత సహకారంతో  పూర్తి రాతికట్టడముగా ఈ నిర్మాణంచేపట్టామన్నారు ఈ ఓ.

ఆధ్యాత్మిక గ్రంథ ప్రచురణలలో భాగంగా శ్రీశైలఖండాన్ని గ్రంథ పరిష్కరణ పద్ధతిలో పరిష్కరింపజేసి ప్రచురించామన్నారు. ఇప్పటి వరకు ఈ శ్రీశైలఖండం ప్రసిద్ధ గ్రంథాలయాలలో వ్రాతప్రతులకు,  తాళపత్ర గ్రంథాలకు మాత్రమే పరిమితమై ఉండేదన్నారు.

అందుకే గ్రంథ పరిష్కరణ పద్దతిలో శ్రీశైలఖండాన్ని ప్రచురింపజేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.  ఇప్పటికే శ్రీశైలఖండం తెలుగు, సంస్కృత భాషలలో ప్రచురించడం జరిగిందన్నారు. ఈ శ్రీశైలఖండం కన్నడ , ఆంగ్ల భాష అనువాద కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. ఇక శ్రీశైలఖండ ప్రచురణలో ఎంతో కీలకపాత్ర పోషించిన ప్రముఖ పండితులు  సీతారామాంజనేయశర్మ, భీమవరం వారికి ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ అన్ని కార్యక్రమాలకు కూడా సిబ్బంది అందరు ఎంతగానో సహకరించారన్నారు.

తరువాత పలు విభాగాల అధికారులు ప్రసంగిస్తూ దేవస్థానంలో జరిగిన అభివృద్ధిని కొనియాడారు.

చివరగా దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు సుబ్బారెడ్డి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రాభివృద్ధికి కార్యనిర్వహణాధికారి ఎంతగానో శ్రమించారన్నారు . దేవస్థాన ఉద్యోగుల అందరి తరుపున యూనియన్ అధ్యక్షులు కార్యనిర్వహణాధికారికి అభినందనలు తెలియజేశారు.

print

Post Comment

You May Have Missed