×

మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు-నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాల పరిశీలన

మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు-నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాల పరిశీలన

శ్రీశైల దేవస్థానం:ఫిబ్రవరి 22 నుండి మార్చి 4వ తేదీ వరకు జరిగే  మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని వివిధ ఏర్పాట్లను చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు పాదయాత్రతో వెంకటాపురం, నాగలూటి, దామర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుంటారు.ఈ కారణంగా కాలిబాట లో అటవీశాఖ, వైద్య ఆరోగ్యశాఖ సహకారం తో భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించవలసివుంది.

ఈ ఏర్పాట్లకు సంబంధించి సోమవారం  కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. బాలమురళీకృష్ణ, సహాయ కమిషనర్ (ఐ/సి),  సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

 కార్యనిర్వహణాధికారి  కాలిబాటమార్గంలో    మంచినీటి  సదుపాయం, నాగలూటి వద్ద అన్నదానం చేసే భక్తులకు అందించనున్న సహాయ సహకారాలు,  మార్గసూచికల ఏర్పాటు, వైద్యశిబిరాల ఏర్పాటు మొదలైన అంశాలను పరిశీలించారు. .

 కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ అటవీశాఖ వారి సహకారంతో నాగలూటి వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా జంగిల్ క్లియరెన్స్ చేయాలన్నారు. నాగలూటి వద్ద గల కోనేర్లకు మరమ్మతులు చేసి వాటిని శుభ్రపర్చాలన్నారు. పెద్ద చెరువు వద్ద గత సంవత్సరం  కంటే కూడా అదనంగా చలువపందిళ్ళు వేయాలని సూచించారు.ఉత్సవాల సమయం లో నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాలకు గత సంవత్సరం కంటే కూడా అధికసంఖ్యలో వాటర్ ట్యాంకర్లను పంపాలని ఆదేశించారు. 

 కాలిబాటతో వచ్చే భక్తులు ప్రధానంగా కాలిబొబ్బలు, ఒళ్లు నొప్పులు మొదలైన ఇబ్బందులతో బాధపడుతుంటారు. అందుకే జిల్లా వైద్యశాఖ సమన్వయముతో అటవీ మార్గంలో ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాలలో ఈ సమస్యలకు సంబంధించిన పూతమందులు (ఆయింట్ మెంట్) మాత్రలు మొదలైనవి అందుబాటులో వుంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు గత సంవతర్సరం  వలనే పెద్ద చెరువు వద్ద కంకణాలను ( రిస్ట్ బ్యాండ్లను ) ధరిపంజేసేందుకు ఈ సంవత్సరం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ పాదయాత్ర భక్తులు దర్శనానికి అధిక సమయం వేచివుండకుండా వుండే విధంగా ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తారన్నారు.

print

Post Comment

You May Have Missed