
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్రంలో సుందరీకరణకు ఈ ఓ లవన్న చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి చర్యలలో భాగంగా సుందరీకరణకు కూడా చర్యలు చేపడుతున్నారు.
ఈ సుందరీకరణ ప్రణాళిక రూపొందించేందుకుగాను ఈ రోజు (07.09.2021)న కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సంబంధిత ఇంజనీరింగ్, ఆలయ, ఉద్యానవన విభాగాధికారులతో కలిసి ఆలయమాడవీధులు, ఆలయప్రాంగణం మొదలైనవాటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ప్రాకారకుడ్యం, కుడ్య శిల్పాలు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా కళాతాత్మక విద్యుద్దీకరణకు అంచనాలను రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
ఆలయప్రాంగణములోని సాలుమండపాలు, నందిమండపం, వీరశిరోమండపం, పంచపాండవుల ప్రతిష్ఠ ఆలయాలు, నవబ్రహ్మఆలయాలు, అమ్మవారి ఆలయంలోని మండపాలు మొదలైన వాటికి కూడా కళాత్మక విద్యుద్దీకరణ పనులకు అంచనాలను రూపొందించాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆలయప్రాంగణములో దక్షిణ భాగములో గల మరమ్మతులు అవుతున్న మూడు పురాతన ఆలయ సముదాయాన్ని కూడా సందర్శించారు. ఈ ఆలయాల మరమ్మతులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రధానాలయానికి నలువైపులా గల గాలిగోపురాలకు కూడా ఆకర్షణీయ విద్యుద్దీకరణకు చర్యలు చేపట్టాలన్నారు.
ఆలయప్రాంగణములో అవకాశమున్నచోట మరిన్ని పచ్చిక బయళ్ళను , సుందరీకరణ మొక్కలను పెంచాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం. హరిదాసు, పి. నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహరెడ్డి, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీరు సుబ్బారెడ్డి, సహాయస్థపతి ఉమావెంకటజవహర్లాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు భవనకుమార్, ప్రణయ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.