
శ్రీశైల దేవస్థానం:ప్రధానాలయానికి తూర్పుభాగంలో నిర్మిస్తున్న శివంరోడ్డు నిర్మాణాన్ని మంగళవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. రూ. 80 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి నిర్మాణానికి ఈ నెల 12వ తేదీన భూమిపూజ జరిగింది. పరిశీలనలో ముందుగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న రహదారి నిర్మాణం గురించి ఉపముఖ్యమంత్రికి వివరించారు.
ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రధాన వీధులలో స్వామివార్ల ప్రభోత్సవం, రథోత్సవం, గ్రామోత్సవాలను భక్తులందరు వీక్షించేందుకు వీలుగా ఈ రహదారిపై తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఈ రహదారి ఆహ్లాదకరంగా ఉండేవిధంగా ఇరువైపులా సుందరీకరణ మొక్కలతో పచ్చదనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా కూడా తగు చర్యలు చేపట్టాలన్నారు.భక్తులు దర్శనానంతరం సులభంగా శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయానికి చేరుకునే విధంగా బయటకు వచ్చే దారులు వుండాలని కూడా ఆదేశించారు.
పరిశీలనకు ముందు ఉపముఖ్యమంత్రి ఆలయానికి విచ్చేసి శ్రీస్వామిఅమ్మవార్లకు పూజలు నిర్వహించుకున్నారు.
ఈ వేకువజామున ఆలయం వద్దకు చేరుకున్న ఉపముఖ్యమంత్రికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు స్వాగతం పలికారు.అనంతరం మంత్రి శ్రీస్వామివారికి అభిషేకాన్ని, అమ్మవారికి కుంకుమార్చనను జరిపించుకున్నారు. తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనముతో ఉపముఖ్యమంత్రికి శేషవస్త్రాలు, ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల చిత్రపటం అందించారు.
ఆలయంలో ముఖ్యమంత్రి పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం ఏర్పాటు చేసిన వసతి, దర్శనం తదితర సౌకర్యాల గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు.