శ్రీశైల దేవస్థానం:గతంలో ఎక్కడో ఒక ఆలయంలో జరిగిన సంఘటనను శ్రీశైల క్షేత్రంలో జరిగినట్లుగా పేర్కొంటూ కొందరు సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చిందని అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ ఓ ఉత్తర్వుల మేరకు ఎడిటర్ వివరాలు తెలిపారు.ఆ పోస్టింగు లో ఒక వ్యక్తి అక్కడి ఆలయ సిబ్బందితో వాగ్వాదం చేస్తూ ఆలయంలో ఏఏ పనులు చేయవచ్చు, ఏఏ పనులు చేయకూడదనే అంశాలపై కనీస అవగాహన కూడా ఆలయ కార్యనిర్వహణాధికారికి ఉండడం లేదని, ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలతోనే ఆలయ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపు చేస్తున్నారని, అయినప్పటికీ వేదపండితులకు, భక్తులకు ఆలయంలో సరైన గుర్తింపు లేదని పేర్కొన్నట్లుగా తెలిసింది.అయితే ఈ సంఘటన ఏ ఆలయంలో జరిగిందన్న విషయం ఆ వీడియోలో స్పష్టంగా గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందన్న విషయం కూడా తెలియరాలేదు.అయినప్పటికీ కొందరు ఈ వీడియో క్లిప్పింగును సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తూ ఈ సంఘటన శ్రీశైల క్షేత్రంలో జరిగిందని, ఒక అర్చకుడు దేవస్థానం కార్యనిర్వహణాధికారివారిని నిలదీశాడని పేర్కొన్నారు.
ఈ సంఘటన శ్రీశైలక్షేత్రంలో జరిగినట్లుగా అసత్య ప్రచారం చేయడం వలన దేవస్థానం పేరు ప్రఖ్యాతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఎంతైనా వుంది. ముఖ్యంగా ఇలాంటి దుష్ప్రచారం వలన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవ విషయాలను గ్రహించవలసినదిగా భక్తులను దేవస్థానం కోరింది.