శ్రీశైల క్షేత్రాభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది-ఈ ఓ లవన్న
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్రాభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఓ లవన్న పేర్కొన్నారు. ఈ రోజు ( 28.08.2021)న సాయంత్రం పరిపాలనా కార్యాలయం లోని సమావేశ మందిరంలో కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న అధికారులతో సమావేశమయ్యారు.అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థానంలోని ఆయా విభాగాలలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సిబ్బంది వివరాలు, ఆలయంలో జరిగే పూజాదికాలు, దేవస్థానం నిర్వహిస్తున్న హిందూ ధర్మప్రచార కార్యక్రమాలు, దేవస్థానంలో ప్రస్తుతం జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, భక్తులకు అందుబాటులో వున్న వసతి సదుపాయాలు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు, స్థానికులకు అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలు, గోశాల నిర్వహణ, ఆగమపాఠశాల నిర్వహణ, రవాణా విభాగ నిర్వహణ, శ్రీశైలప్రభ ముద్రణ, దేవస్థానం ప్రచురణలు, ప్రజాసంబంధాలు, దేవస్థానం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన అంశాలను సమీక్షించారు.
సమావేశంలో కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ సిబ్బంది అందరు కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రతి విభాగం కూడా నైపుణ్యతను పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. దీనివలన అన్ని విభాగాలు కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతాయన్నారు.అదేవిధంగా దేవస్థానములోని అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయముతో ఆయా విధులు నిర్వర్తించాలని సూచించారు.ముఖ్యంగా ఎప్పటికప్పుడు భక్తులకు సౌకర్యాల మెరుగుదలకు ప్రణాళికలు రూపొందించుకుంటూ తదనుగుణంగా చర్యలు చేపడుతుండాలన్నారు.క్షేత్రాభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా దేవస్థానం విరాళ పథకాలు, గోశాల నిర్వహణ, వైద్యశాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా దాతలు విరాళాలను అందించే అవకాశం ఉందన్నారు.అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనం పెంపొందించడంపై ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా విరివిగా చేపట్టాలని చెబుతూ, దేవతా వృక్షాలను వీలైనంత ఎక్కువ ప్రదేశాలలో నాటాలని సూచించారు.
Post Comment