
శ్రీశైల దేవస్థానం: హైదరాబాద్ వాస్తవ్యులైన బాలం సుధీర్ మంగళవారం దేవస్థానానికి ధర్మప్రచార రథాన్ని విరాళంగా సమర్పించారు. సుమారు రూ.72 లక్షల వ్యయంతో ఈ రథాన్ని రూపొందించినట్లుగా దాత తెలియజేశారు.
ఆలయ నమూనాలో రూపొందించిన ఈ ధర్మప్రచార రథంలో శ్రీస్వామిఅమ్మవార్ల అనుకృతమూర్తులు ఉన్నారు. అదేవిధంగా కల్యాణ మూర్తులు ఉన్నారు. వాహనానికి ముందువైపు సాక్షిగణపతి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. రథానికి వెనుకవైపున దక్షిణామూర్తి, కుడివైపున గణపతి, కుమారస్వామివార్లను రూపొందించారు.
ఈ రోజు ఉదయం గంగాధర మండపం వద్ద ఈ ధర్మప్రచారరథానికి శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థాన చైర్మెన్‌గా నియామకం అయిన పి. రమేష్‌నాయుడు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో ధర్మప్రచారం నిర్వహించేందుకు దేవస్థానం వినియోగిస్తుందని తెలిపారు.
అనంతరం దాత మాట్లాడుతూ దేవస్థానానికి ధర్మప్రచార రథాన్ని సమర్పించడం తమ పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామన్నారు. శ్రీస్వామిఅమ్మవార్ల అనుగ్రహంతో తమకు ఈ అదృష్టం కలిగిందన్నారు.