
శ్రీశైల దేవస్థానం: మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం ఘనఘనంగా జరిగింది.ఈ రోజు రాత్రి గం.12.00 లకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరిపారు.
కనుల పండువగా స్వామివారు పట్టువస్త్రాన్ని ధరించి, తలపై ఒకవైపు గంగమ్మను, మరొకవైపు నెలవంకను, మెడలో రుద్రాక్షమాలను, నుదుట విభూతి రేఖలను, పట్టువస్త్రాలను ధరించి పెండ్లికుమారుడుగా ముస్తాబు అయ్యారు.
అమ్మవారు కూడా పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడనిపించనున్నారు. మంగళ తూర్యనాదాలతో, వేదమంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కల్యాణోత్సవం జరిగింది. అంతకు ముందు ఈ లీలా కల్యాణానికి కంకణాలను స్వామిఅమ్మవారి అభరణాలను, యజ్ఞోపవీతాన్ని, భాషికాలను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పి తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. ఆ తరువాత వృద్ధి అభ్యుదయాల కోసం పుణ్యహవచనం చేసారు.తరువాత కంకణపూజ, యజ్ఞోపవీతపూజ చేసి స్వామివారికి కంకణధార, యజ్ఞోపవీతధారణ చేసారు. అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను పఠించి ఆ తరువాత స్వామివారికి వరపూజను జరిపారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠనాన్ని చేసారు.
తరువాత స్వామివారికి మధుపర్కం సమర్పించి, శ్రీస్వామిఅమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు. తరువాత భాషికధారణ కార్యక్రమం జరిపారు. ఆ తరువాత గౌరీపూజ జరిగింది.
స్వామిఅమ్మవార్ల మధ్య తెర సెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం చేసారు. అనంతరం సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. ఆ తరువాత మాంగల్య పూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని అందించారు.