×

కర్నూలు జిల్లాలో మహిళలకు దిశ యాప్‌ వినియోగం పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

కర్నూలు జిల్లాలో మహిళలకు దిశ యాప్‌ వినియోగం పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

-ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం “దిశ యాప్” :-

-మహిళా భద్రతకు యాప్‌తో అభయం.. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట :-

-“దిశ యాప్‌” కు పెరుగుతున్న ఆదరణ :-

-జిల్లాలో ఇప్పటికే 5,12,161లక్షలకు పైగా డౌన్‌లోడ్లు :-

-దిశ ఎస్‌వోఎస్‌ కాల్స్ 164 లో పరిష్కారమైనవి 162 :-

-79 పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్ లు :-

-జిల్లాలో 60 దిశ ద్విచక్ర వాహనాలతో మహిళా పోలీసులు నిరంతరం గస్తీ :-

రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల భద్రత కోసం రూపొందించిన ‘దిశ’ యాప్‌ నిమిషాల వ్యవధిలోనే బాధితులకు సాయం అందిస్తూ అడుగడుగునా అండగా నిలుస్తోంది. ఆకతాయిల అల్లరి.. ఆగంతకుల వేధింపులు.. బ్లాక్‌ మెయిల్‌… అసభ్య ఫొటోలు.. వీడియోలతో బెదిరింపులు.. దాడులు.. గృహహింస.. ఇలా అన్ని రకాల వేధింపులకు పాల్పడే వారి పాలిట వజ్రాయుధంలా పని చేస్తూ.. ప్రతి మహిళకు “రక్షా బంధనం”లా నిలిచింది. వారి సామాజిక భద్రతకు భరోసానిస్తూ..గాంధీజీ కలలు కన్న మహిళల స్వేచ్చాయుత జీవనానికి నాంది పలికింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోలీసు శాఖ తెచ్చిన యాప్‌ సమర్థ వంతమైన పనితీరును కనబరుస్తోంది. గతంలో మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరిగేది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి బాధితులు సందేహించేవారు. ఒక వేళ ఫిర్యాదు చేసినా పోలీసులు తక్షణం స్పందిస్తారన్న నమ్మకం ఉండేది కాదు. తమ వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతాయని జంకేవారు. ఇలాంటి ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తూ దిశ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. మొబైల్‌ ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు భరోసా కల్పిస్తోంది. ఏదైనా సమస్య ఎదురైతే యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కినా, గట్టిగా అటూ ఇటూ ఊపినా చాలు కొద్ది నిముషాల్లోనే పోలీసుల ద్వారా రక్షణ లభిస్తోంది. దీంతో యాప్‌ పట్ల మహిళల్లో విశ్వాసం పెరుగుతోంది.

మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను న్యాయస్థానంలో దోషులుగా నిరూపించి తగిన శిక్షలు పడేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పంతో వ్యవహరిస్తోంది. దిశ వ్యవస్థ కోసం ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 900 స్కూటర్లను సమకూర్చింది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8 మంది నుంచి 10 మందితో మహిళా మిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. సైబర్‌ నేరాలు, సైబర్‌ వేధింపులపై ఫిర్యాదులకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్లు, ట్విట్టర్‌ ఖాతాలను అందుబాటులోకి తెచ్చారు.

కర్నూలు జిల్లాలో 29-08-2021 తేదీ నాటికి 5,12,161 మంది “దిశ యాప్‌”ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం. కర్నూలు జిల్లాకు కేటాయించిన 60 దిశా ద్విచక్ర వాహనాల ద్వారా మహిళా పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నారు. దిశా యాప్ పై 2398 అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాకు గ్రామ, వార్డు సచివాలయం (మహిళా పోలీసులు) ను 1191 కేటాయించగా అందులో ప్రస్తుతానికి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు 1160 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కడం ద్వారా.. జిల్లాలో ఆగస్టు 22 వ తేదీ వరకు 164 కాల్స్ రికార్డు నమోదు కాగా..అందులో 162 పరిష్కరించడం జరిగింది. 79 పోలీస్ స్టేషన్లలో 158 మహిళా మిత్ర కోఆర్డినేటర్ లు ఉండగా అందులో 1209 మహిళా మిత్ర కమిటీ మెంబర్లు, 2445 మహిళా మిత్ర సపోర్ట్ గ్రూపులున్నాయి

దిశా డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ :-

దిశా పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ హెల్ప్ లైన్ 7777877700 వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 112 కాల్స్ వచ్చాయి. దిశా డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ పై 2019 అవగాహన సదస్సులు పోలీసులు నిర్వహించారు. 52 బాల్యవివాహాలను నిలువరించారు. బాలికలు, విద్యార్థినులు, మహిళలపై ఆకతాయిలు చేస్తున్న 69 ఈవ్టీజింగ్ కేసులకు కౌన్సెలింగ్ ఇవ్వగలిగారు.

పోస్కో ఆక్ట్ కేసులు దిశా మహిళా పోలీస్ స్టేషన్లో 43 ఇన్వెస్టిగేషన్ కేసుల్లో చార్జిషీట్ / ఫైనల్ రిపోర్ట్ పూర్తి అయినవి 41 కాగా ఇంకా రెండు కేసులు విచారణలో ఉన్నాయి… *రేప్ కేసులకు * సంబంధించి దిశా మహిళ పోలీస్ స్టేషన్ లో 04 ఇన్వెస్టిగేషన్లో. ఉండగా . 04 చార్జిషీట్ పూర్తి అయినాయి.

మహిళలకు సంబంధించిన ఇతర కేసులకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాటిలో 01-01-2020 నుంచి 07-08-2021 దిశ మహిళా పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ 77…. ఇందులో ఛార్జి సీట్/ ఫైనల్ రిపోర్ట్ 62, ఇంకా విచారణ జరగాల్సినవి 15 కేసులు కలవు.

మహిళా వేధింపుల కేసులు దిశ మహిళా పోలీస్ స్టేషన్ లో 08-03-2020 నుంచి 07-08-2021 వరకు అర్జీలు వచ్చినవి 1372, వివిధ రకాల కౌన్సిలింగ్ ద్వారా కాంప్రమైజ్ అయినవి 1164, ఇందులో ఇంకా ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ అయినవి 179, 29 పిటీషన్లు పెండింగ్ డిస్పోజల్ కలవు.

ప్రతి మహిళా దిశ యాప్ నిర్వహణ, ఉపయోగించడం పై తప్పక అవగాహన పెంచుకోవాలి – జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :-

ప్రతి మహిళా దిశ యాప్ నిర్వహణ, ఉపయోగించడం పై ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన పెంచుకోవాలి. చిన్నారులూ, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలను అరికట్టే దిశగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. దిశ వ్యవస్థ మరింత పటిష్టం కావడానికి..అన్ని సచివాలయ మహిళా సంరక్షకులు, పోలీసులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు, దిశ పోలీసు, సఖి, అంగన్వాడీ తదితర అన్ని శాఖల, వర్గాలకు చెందిన మహిళలు.. మరింత సంపూర్తిగా అవగాహన పెంచుకుని.. సమాజంలో మహిళలపై ఎలాంటి నేర పూరిత సంఘటనలకు అవకాశం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లాలో సమర్థవంతంగా “దిశ” అమలు – జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి :-

జిల్లాలో “దిశ చట్టం” సమర్థవంతంగా అమలు అయ్యేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సంయుక్తంగా.. సమగ్రంగా కృషి చేస్తున్నాయి. “దిశ” వ్యవస్థ ద్వారా.. సమాజంలో హింసలను అరికట్టడంతో పాటు.. కేసుల నమోదు శాతాన్ని తగ్గించవచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా.. తమ సెల్ ఫోన్లలో దిశ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని.. దిశ ఎస్.ఓ.ఎస్. నిర్వహణపై అవగాహన పెంచుకుని.. 100% భద్రత తమ వెంట ఉందనే నమ్మకంతో ముందుకు సాగాలి. మహిళలకు రక్షణ ఇచ్చే విధంగా దిశ యాప్ ధైర్యాన్ని, నమ్మకాన్ని అందిస్తోంది. సమాజంలో మహిళలకు.. న్యాయ పరంగా, పోలీసు పరంగా వంద శాతం న్యాయంతో పాటు, బాధితురాలికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై “దిశ” పోలీసు సిబ్బంది చర్యలు చేపడుతోంది.

దిశ చట్టం, దిశ యాప్ నిర్వహణ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం :-

నా పేరు ఆదిలక్ష్మి, సచివాలయ పోలీస్, అంబేద్కర్ కాలనీ కర్నూలు నగరం. మా వార్డు పరిధిలోని విద్యార్థులు, బాలికలు, మహిళలకు వారి ఇంటి వద్దకు వెళ్లి దిశ యాప్ పై అవగాహన కల్పించి డౌన్ లోడ్ చేయించాను. దిశ పై ప్రతి మహిళకు అవగాహన ఉండాలి. ఇప్పటికే.. సంబందిత అనుబంధ శాఖల భాగస్వామ్యంతో.. దిశ చట్టం, దిశ యాప్ నిర్వహణ, వాడకంపై కౌన్సిలర్ల ద్వారా విధ్యా సంస్థలు, వసతి గృహాలలో బాలికలకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతోంది.-యు. ఆదిలక్ష్మి, సచివాలయ పోలీస్, అంబేద్కర్ కాలనీ ,కర్నూలు నగరం, .

మహిళా భద్రతకు యాప్‌తో అభయం.. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట :-

నాపేరు ఎస్ అస్మా జబీన్, కర్నూలు వన్ టౌన్ పరిధిలోని మహిళా సచివాలయం పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నాను. మా సచివాలయం పరిధిలోని విద్యార్థులు, బాలికలు మహిళలకు దిశ ఆపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన కరపత్రాల ద్వారా ఇంటింటికి తెలియజేస్తున్నాము.
దిశ యాప్ నిర్వహణలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర మహిళల్లో.. మనోధైర్యం పెరిగింది. ఉద్యోగినులు, విద్యార్థినులు ఒంటరిగా, నిర్భయంగా నడవగలుగుతున్నారు. జిల్లాలో “దిశ చట్టం” సమర్థవంతంగా అమలు అయ్యేందుకు నా వంతుగా బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వ ఆశయ సాధన దిశగా.. ఆధికారుల సూచనల మేరకు మహిళల రక్షణకు సేవ చేస్తున్నా. మహిళా భద్రతకు యాప్‌తో అభయం.. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట వేసినట్లే. -ఎస్ అస్మా జబీన్ మహిళా సచివాలయ ఉద్యోగి, బాపూజీ నగర్, కర్నూలు నగరం, కర్నూలు జిల్లా.

దిశ మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతోంది :-

నా పేరు బి.మనీషా, సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగినిగా.. విధులు నిర్వర్తించడం సంతృప్తినిస్తోంది. మహిళల భద్రతపై ప్రభుత్వ సేవలను.. మహిళా పోలీసుగా.. గర్విస్తున్నా. జిల్లాలో దాదాపు.. 5,12,161 మంది యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం జరిగింది.-బి.మనీషా, సచివాలయ మహిళా పోలీసు, గురు బ్రహ్మ నగర్, కర్నూలు నగరం, కర్నూలు జిల్లా.-DD I&PR KURNOOL
print

Post Comment

You May Have Missed