శాస్త్రాన్ని శ్రద్ధతో అవగాహన చేసుకోవాలి-బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ
శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలలో భాగంగా శనివారం ఏడో రోజు ప్రవచనాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం ప్రవచకులు ముందుగా వసుమతి కథను వివరించారు. ప్రాచీనకాలంలో శ్రీశైలానికి మందరపర్వతమనే పేరు ఉన్నదని పేర్కొన్నారు. పురాణాలలో అనేకచోట్ల శివుడు సర్వదేవతాగణాలతో మందర పర్వతములో ఉన్నట్లుగా పేర్కొనబడిందన్నారు. ఆ మందర పర్వతమే శ్రీశైలమని తెలియజెప్పారు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో కొలువై వుండి అనేక దేవకార్యాలను నిర్వహిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయన్నారు.
ఈ శ్రీశైలాన్ని కేంద్రంగా చేసుకుని పరమేశ్వరుడు విశ్వనిర్మాణ కార్యక్రమాలన్ని నిర్వహిస్తుండడం వల్ల శ్రీశైలక్షేత్రం విశ్వకార్యాలకు కేంద్రస్థానం అనే ప్రసిద్ధి పొందిందన్నారు సామవేదం.ఈ భవ్యక్షేత్రానికి క్రౌంచపర్వతం అనే పేరు ఉన్నట్లుగా శివపురాణం పేర్కొందన్నారు. ఈ విధంగా శ్రీశైలానికి మందరపర్వతం, క్రౌంచపర్వతం, శ్రీపర్వతం అనే పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు.శ్రీశైలక్షేత్రవైభవం పురాణాలలో ప్రసిద్ధి చెందడమే కాకుండా, చరిత్రలో కూడా ప్రశస్తి పొందిందన్నారు.
ప్రవచనంలో భాగంగా పలు ధార్మిక సంబంధి అంశాలను కూడా వివరించారు. వైదికశాస్త్రమంటే ఋషుల అనుభవం అన్నారు. అందుకే మన శాస్త్రాలను మనం విశ్వసించాలన్నారు. మన విశ్వాసానికే శ్రద్ధ అనే పేరును చెప్పుకోవచ్చునన్నారు. అందుకే శాస్త్రాన్ని శ్రద్ధతో అవగాహన చేసుకోవాలన్నారు. ఆధ్యాత్మిక సాధనలో శాస్త్రం పేర్కొన్న విధానాలనే అనుసరించాలన్నారు.శ్రీశైల క్షేత్రమంతా తపోభూములతో, దివ్యధామాలతో నిండి ఉందన్నారు. మనం భౌతికంగా చూడలేని దివ్యత్వం శ్రీశైలక్షేత్రంలో అణువణువునా విస్తరించి ఉందన్నారు.
Post Comment