శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం తొమ్మిది రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి దివ్య ప్రవచనాలను ఏర్పాటు చేసింది.
‘గణపతి గాథలు’ అను అంశంపై ఈ ప్రవచనాలు శనివారం ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన చేశారు. తరువాత ప్రవచకులు తమ ప్రవచాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసమని అన్నారు. అటువంటి శ్రీశైల క్షేత్రంలో సాక్షిగణపతి, రత్న గర్భగణపతి దర్శనమివ్వడం అదృష్టమన్నారు.
అంతేకాక వేదాల్లో, ఆగమాలలో, పురాణాల్లో, ఇతిహాసాలలో గణపతి గురించిన గాథలు చాలా ఉన్నాయని, పార్వతీపరమేశ్వరుల పుత్రుడిగానే కాక గణపతి స్వరూప స్వభావాలు ఇతరత్రా గ్రంథాలలో పుష్కలంగా ఉన్నాయని, సృష్టికి పూర్వమే ఉన్న బ్రహ్మదేవుడికి ఓంకారం గణపతి ఆకారంలో దర్శనం ఇచ్చి సృష్టి రచనకు పుష్టినిచ్చిందని అన్నారు.గణపతి ఆది నుండి ఉన్నాడు కనుక ఆయన్ని ఆదిపూజ్యుడుగా ఆరాధిస్తున్నామని, వేదాలకంటే ముందుగా ఓంకార రూపంలో గణపతి ఆవిర్భవించాడని, బ్రహ్మదేవుడి చేత వ్యాసభగవానుడు గణపతి మంత్రోపదేశం పొంది, గణపతిని ధ్యానించి, ప్రార్థించి తన రచనలకు శ్రీకారం చుట్టాడని, గణపతి సాక్షాత్ శివశక్తుల స్వరూపమని, రానున్న వినాయక చవితి నవరాత్రులకు ఈ ప్రవచనాలు నాంది అని అన్నారు. సనాతనధర్మం, వైదిక ఆచారాలకు సంబంధించిన పలు అంశాలను కూడా వివరించారు.