శ్రీశైల దేవస్థానం:శ్రీశైల ఆలయ శిల్పప్రాకారం భారతీయ శిల్పంలోనే ప్రత్యేకతను కలిగివుంది. ఆలయం చుట్టూ కోటగోడ మాదిరిగా భాసిల్లే ఈ ప్రాకారంపై పలు శిల్పాలను మలిచారు. ఇటువంటి శిల్ప ప్రాకారాన్ని కేవలం హంపీలోని హజారాస్వామివారి ఆలయంలో మాత్రమే చూడగలమని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఈ అరుదైన ప్రాకార శిల్పాల విశేషాలను గురించి భక్తులకు తెలియజెప్పేందుకు వీలుగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఇటీవల ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖామంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.అదేవిధంగా ఆలయ శిల్ప ప్రాకార విశేషాలను శాశ్విత ప్రాతిపదికన భద్రపరిచేందుకు వీలుగా డిజిలైజేషన్ చేయించాలని, అందులో భాగంగా ప్రాకార శిల్పాలను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ చేయించాలని కూడా ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రాకార శిల్పాల ఆయా ఛాయాచిత్రాలు, వాటి విశేషాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించాలని, వీడియో డాక్యుమెంటరీని కూడా రూపొందించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.తదనుగుణంగా గురువారం ప్రాకార శిల్పాల ఫోటోగ్రఫీ పనులు ప్రారంభించారు. 9 అండ్ 9 డిజి సాఫ్ట్ ఇన్సైట్స్ ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్ వారు మొదటి దశగా ఫోటోగ్రఫీ నిపుణులతో ఆయా ప్రాకార శిల్పాల ఛాయాచిత్రాలను తీయించి దేవస్థానానికి ఉచితంగా అందజేస్తున్నారు.
కాగా తూర్పు ప్రాకారం పై గణపతి, వీరభద్ర శిల్పాలకు ఈ ఉదయం పూజాదికాలు జరిపి ఈ ఫోటోగ్రఫీ పనులను ప్రారంభించారు.
పూజాదికాలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, సభ్యులు శ్రీమతి ఎం. విజయలక్ష్మి మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, 9 అండ్ 9 సంస్థ ప్రతినిధులు, ఫోటోగ్రఫీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్ , సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్ లాల్, పలువురు ఇంజనీరింగ్ సిబ్బంది, ఐ.టి. విభాగ సిబ్బంది పాల్గొన్నారు.ఈ ప్రాకార శిల్పాల ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ పనులు డా. వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి, ధర్మప్రచార పరిషత్, దేవదాయశాఖ వారి మార్గదర్శకత్వంలో చేపట్టారు.