శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2023
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
తిరుమల, 2023 సెప్టెంబరు 18: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, శ్రీమతి రోజా, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, బోర్డు సభ్యులు యానాదయ్య, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రహ్మణ్యం, భరత్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, మధుసూదన్ యాదవ్, ఈవో ఎవి.ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డికె.బాలాజి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత, సివిఎస్వో నరసింహకిషోర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ రామకృష్ణ దీక్షితులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.