శ్రీశైల దేవస్థానం:ప్రతి గ్రామంలో బడి – గుడి నిలబెట్టుకుంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని ధార్మిక సదస్సు పిలుపు ఇచ్చింది. శుక్రవారం దేవస్థానంలోని అన్నప్రసాద వితరణ భవనం వద్ద కమాండ్ కంట్రోల్ సముదాయంలోని సమావేశ మందిరంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్.డి.పి.టి.) ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి యం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ఈ సదస్సులో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు, శ్రీశైల దేవస్థానంతో పాటు కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల హెచ్.డి.పి.టి. కోఆర్డినేటర్లు, , అర్చకుల సమాఖ్య వారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేవస్థానంలో గిరిజన చెంచులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చెంచులకు నెలకొకసారి ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పించే కార్యక్రమం గత ముక్కోటి ఏకాదశిన ప్రారంభించామన్నారు.
అనంతరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హెచ్.డి.పి.టి. చేసే కార్యక్రమాలకు శ్రీశైలం దేవస్థానం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్వచ్చంద సేవకులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, ధర్మప్రచారం కోసం తగినంత సహాయ సహకారాలు దేవస్థానం తరుపున చేస్తామని తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ హెచ్.డి.పి.టి. ఆధ్వర్యంలో రానున్న ఉగాది పండుగ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో పిల్లలకు సాముహిక అక్షరాభ్యాసాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కనీసం దీపం కూడా వెలిగించని అనేక దేవాలయాలు ఉన్నాయని, వీటన్నింటిని గుర్తించి త్వరలోనే ఒక మంచి రోజున అన్ని దేవాలయాల్లో హెచ్.డి.పి.టి. ఆధ్వర్యంలో ప్రతీరోజు దీపం వెలిగించే పవిత్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అర్చక యూనివర్సిటీని కూడా స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దైవభక్తితోపాటు దేశభక్తిని కూడా ప్రతిఒక్కరు పెంపొందించుకోవాలని, ప్రతి గ్రామంలో బడి – గుడి నిలబెట్టుకుంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.
రానున్న గోదావరి కృష్ణ పుష్కరాలను పురస్కరించుకొని ఇప్పటినుండే రాష్ట్రంలోని పవిత్ర పుణ్య నదులైన కృష్ణ, గోదావరి నదుల వెంట దేవతా వృక్షాలను నాటించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమానికి నాందిగా మొదట మార్చి 7 తేదీన ముఖ్యమంత్రి గారి సమక్షంలో కృష్ణానదిపై గల ప్రకాశం బ్యారేజీ నుండి హంసలదీవి వరకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక దేవాలయాలను, అర్చకులను, హెచ్.డి.పి.టి. కోఆర్డినేటర్లు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ధార్మిక పరిషత్తులు సంఘాల వారిని భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు.
కాగా ఈ కార్యక్రమానికి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి గుండ్ల గంగమ్మ మరియు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ స్టేట్ కోఆర్డినేటర్లు సందిరెడ్డి కొండలరావు, కోట సునీల్ కుమార్ సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆగమ పాఠశాల విద్యార్థులు, తదితర దేవస్థాన సిబ్బంది. పులువురు శివసేవకులు పాల్గొన్నారు.
వైభవంగా స్వర్ణ రథోత్సవం:
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజు శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.
ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవం జరిగింది.
ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.
అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపారు.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేసారు. అదేవిధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం, ఏర్పాటు అయింది.
ఈనాటి స్వర్ణరథోత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, హిందూధర్మపరిరక్షణ ట్రస్ట్ ఛైర్మెన్ డా. దాసరి శ్రీనివాసులు, ( రిటైర్డు ఐ.ఏ.ఎస్. ) అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ:
చైత్రమాసంలో పౌర్ణమి తరువాత శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 7న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.
అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.
కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం , శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది.
ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించడం జరిగింది. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.
చక్కగా ఊయలసేవ:
లోకకల్యాణం కోసం ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ వుంటుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపారు. తరువాత చివరగా ఊయలసేవ నిర్వహించారు.
ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపారు.
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.
*విరాళం
*సి.హెచ్. సీతారాంబాబు, కొత్తగూడెం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 5,11,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
బంగారు రుద్రాక్షమాల, హారం విరాళం:
ఈ రోజు కూరపాటి మాధవి , కుటుంబ సభ్యులు, బాపట్ల వారు బంగారు రుద్రాక్షమాల, బంగారు హారాన్ని దేవస్థానమునకు సమర్పించారు. వీటిలో 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం తయారు చేయించినట్లు తెలిపారు. 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించినట్లు దాతలు తెలిపారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ వీటిని పర్యవేక్షకులు జి. రవికుమార్, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునులకు అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.
*
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు ఎస్ నటరాజ కూచిపూడి అకాడమి, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన ఏర్పాటు అయింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో వినాయకకౌత్వం, శివాష్టకం, లింగాష్టకం, ఓం నమశ్శివాయ, శివతాండవం తదితర గీతాలకు భవ్యశ్రీ, ప్రవస్థి, మేఘన, తన్వి, మానస, చందన, అపర్ణ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
