శ్రీశైల దేవస్థానం:
ధర్మప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోట్ జిల్లా తాలుకా కేంద్రమైన తేర్‌దాళ్‌లోని అల్లమప్రభు దేవస్థానములో ఈ రోజు 25 న ధర్మప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా ఈ ఉదయం ధర్మప్రచార రథం ద్వారా శోభయాత్ర జరిగింది.
ఈ శోభయాత్రలో ముందుగా అర్చక స్వాములు ధర్మ ప్రచార రథములోని స్వామిఅమ్మవార్లకు పూజాదికాలను నిర్వహించారు. తరువాత శోభయాత్ర ప్రారంభించారు.
భక్త బృందాలతో సమన్వయ సమావేశం:
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 16.03.2026 నుండి 20.03.2026 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 19.03.2026 న రానున్నది.
ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల భక్తులు తరలివస్తారు. వీరిలో పలు ప్రాంతాల భక్తులు పాదయాత్రతో శ్రీశైలం రావడం విశేషం.
ఈ సందర్భంగా ఈ రోజు కర్ణాటక రాష్ట్రములోని భాగల్‌కోట్ జిల్లా తాలుకా కేంద్రమైన తేర్‌దాళ్‌లోని అల్లమప్రభు దేవస్థానములో భక్త బృందాలు , స్వచ్ఛందసేవా సంస్థలతో సమన్వయ సమావేశం జరిగింది.
ముందుగా ఉదయం గం.9.30 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ధర్మప్రచార రథయాత్ర బసవేశ్వర సర్కిల్ నుంచి అల్లమప్రభు దేవాలయం వరకు నిర్వహించారు. ఈ రథయాత్రలో అశేషభక్త జనులు దారి అంతా పూలు చల్లుతూ శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల నామాలను ఉచ్ఛరిస్తూ రథానికి స్వాగతం పలికారు.
ఆ తరువాత తేర్దాళ్ పట్టణంలో శ్రీ అల్లమ ప్రభు దేవాలయంలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం గం.12.00లకు సమావేశం ప్రారంభమైనంది.
ఈ సమావేశంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామివారు కూడా పాల్గొని అనుగ్రహభాషణం చేశారు.
జగద్గురు పీఠాధిపతి ప్రసంగిస్తూ దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థమై ఆయా దర్శన ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. ఉగాది ఉత్సవాలలో ప్రతీరోజు వేలాది మంది భక్తులు ఆలయానికి రావడం జరుగుతోందన్నారు. భక్తులు అధికసంఖ్యలో ఉంటున్న కారణంగా ఉత్సవాల రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదన్నారు.
ఈ కారణంగా ఉత్సవ రోజులలో దేవస్థానంవారు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతోందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతోందన్నారు.
అయినప్పటికీ ఉత్సవాలకు ముందు 10 రోజులపాటు అనగా 06.03.2026 నుంచి 15.03.2026 వరకు రోజుకు నాలుగు విడతలుగా దేవస్థానం వారు నిర్దిష్ట వేళలో స్పర్శదర్శానానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
భక్తులు దేవస్థానం నిర్దేశించిన రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని చేసుకోవచ్చునని అన్నారు.
ఇంకా పీఠాధిపతివారు మాట్లాడుతూ భక్తులందరు కూడా సంయమనం పాటిస్తూ శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలన్నారు. అదేవిధంగా దేవస్థానం కల్పించిన ఆయా సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా భక్తులందరు కూడా దేవస్థానానికి సహకరించాలన్నారు. పాదయాత్ర చేసే భక్తులు ఆరోగ్యంపట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు , ఉత్సవాలు విజయవంతం చేసేందుకు భక్తులందరూ కూడా సహకరించాలన్నారు.
అటవీశాఖ విడుదల చేసిన పాదయాత్రికులు చేయవలసినవి – చేయకూడనవి నియమాలను కూడా భక్తులకు వివరించి చెప్పారు. శ్రీశైలక్షేత్రాన్ని స్వచ్ఛ శ్రీశైలక్షేత్రంగా ఉంచాలని అన్నారు.
అంతకు ముందు శ్రీశైలదేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు ప్రసంగిస్తూ శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో కన్నడ ప్రాంతానికి ఎంతో విశిష్టస్థానం ఉందని తెలుపుతూ, కన్నడ భక్తులు శ్రీభ్రమరాంబాదేవివారిని తమ ఆడపడుచుగా, శ్రీమల్లికార్జునస్వామివార్లను తమ అల్లునిగా భావిస్తారన్నారు.
ఇటీవల కాలంలో 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని , ఇదే పంథాలో ఉగాది మహోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా ఎప్పటి వలే కాలిబాట మార్గములో భక్తులకు దేవస్థానం మంచినీటి సరఫరా మొదలైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు
ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులకు అవసరమైన మంచినీరు,మార్గమధ్యంలో దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లను చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలలో విశాలమైన జర్మన్ షెడ్లను, చలువ పందిర్లను వేయడం జరుగుతుందని, భక్తులందరు ఈ చలువ పందిర్లలో సేద తీరవచ్చన్నారు.
అదేవిధంగా క్షేత్రంలో పలుచోట్ల స్నానపు గదులను, మూత్రశాలలను, మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులు వీటిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.
ఇక పాతాళగంగలోనూ, క్షేత్ర పరిధిలో పలుచోట్ల షవరుబాతులకు ( జల్లు స్నానాలకు) ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.
ఉగాది మహోత్సవాలలో పలు భక్తబృందాల వారు క్షేత్రపరిధిలో అన్నదానాలు చేయడం జరుగుతోందన్నారు. అన్నదానం చేసే భక్త బృందాల వారికి దేవస్థానం తరుపున సంపూర్ణ సహాయ సహాకారాలను అందించడం జరుగుతోందన్నారు.
ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు ఆర్. మల్లికార్జున, సహాయ సంపాదకులు కె. సత్య బ్రహ్మాచార్య, పలువురు అర్చకస్వాములు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాల ప్రతినిధులు, స్వచ్ఛందసేవా సంస్థ ప్రతినిధులు మొత్తం 20 బృందాలు పాల్గొన్నారు.
ఈ సాయంత్రం దేవస్థానం ప్రాంగణంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం ప్రత్యేకం.
ఓం నమ:శ్శివాయ🙏
తేదీ : 25-02-2026
సమయం : (4:30 AM TO 10:15 PM)
దర్శనం చేసుకున్న మొత్తం భక్తుల సంఖ్య = 20,053
అన్నప్రసాద వితరణ కేంద్రం భక్తుల సంఖ్య = 5,261
ప్రస్తుత దర్శనం = స్పర్శ దర్శనం
ఈరోజు దర్శనాలు ముగిసినవి
