
శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెన్నైలో శ్రీశైల దేవస్థాన ధర్మప్రచార రధం ద్వారా ధర్మ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా బుధవారం రాత్రి మాధవరంలోని శ్రీ కైలాసనాథర్ కోవెల్ లో శ్రీ స్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం జరిగింది.
ఈ కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని చేసి , తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. అనంతరం స్థలశుద్ధి కోసం పుణ్యాహవచనం చేసారు.
తరువాత కంకణపూజ, యజ్ఞోపవీత పూజ చేసి స్వామివారికి కంకణధార, యజ్ఞోపవీతధారణ చేసారు. అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను పఠించి తరువాత స్వామివారికి వరపూజను జరిపారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠనాన్ని చేసారు.
తరువాత స్వామివారికి మధుపర్కం సమర్పించి తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు వస్త్రాలను సమర్పించి బాషికధారణ చేసారు. ఆ తరువాత గౌరీపూజ జరిగింది. తరువాత స్వామిఅమ్మవార్ల మధ్య తెరసెల్లను ఏర్పరచి మహాసంకల్పం పఠనం చేసారు. అనంతరం సుముహర్త సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ జరిపించారు. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తలకు తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనాన్ని అందించారు.