
శ్రీశైల దేవస్థానం: అభివృద్ధి నమూనా ఆలయంగా శ్రీశైలక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ఆదేశించారు. శ్రీశైల క్షేత్రాభివృద్ధికి సంబంధించి ఈ రోజు (06.09.2021) న సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం లో స్థానిక శాసనసభ్యులుశిల్పా చక్రపాణిరెడ్డి దేవస్థానం అభివృద్ధి పనులను సమీక్షించారు.దేవస్థాన పరిపాలనా భవన సమావేశమందిరం లో జరిగిన ఈ సమీక్షలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు , పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న స్వాగత ప్రసంగాన్ని చేస్తూ భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న విధానాలు, ఆన్లైన్ సేవలు, దేవస్థాన వెబ్ సైట్ ఆధునీకీకరణ, క్షేత్రాభివృద్ధికి ప్రతిపాదిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన అంశాల గురించి వివరించారు.
తరువాత దేవస్థానం వెబ్ సైట్ ఆధునీకీకరణను చేపట్టిన నైన్ అండ్ నైన్ సంస్థ ప్రతినిధులు వెబ్ సైట్ ఆధునీకీకరణకు సంబంధించిన అంశాలను, దేవస్థానం అందిస్తున్న ఆన్లైన్ సర్వీసుకు సంబంధించిన మ్యాడ్యూల్స్ వివరాలను తెలియజేశారు.
అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ దేవస్థానం సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలన్నారు. సామాన్య భక్తుడికి కూడా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వీలైనన్ని చోట్ల నగదు రహిత విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ముఖ్యంగా సామాన్య భక్తులందరు కూడా స్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు.ఆర్జితసేవా టికెట్లు, శీఘ్రదర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లను ఆయా సేవాకర్తల ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యే విధంగా సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. సేవాటికెట్లు, దర్శనం టికెట్లను స్కానింగ్ చేసే విధానాన్ని కూడా రూపొందించుకోవాలన్నారు. దీనివలన ఆర్జిత సేవా, దర్శనం టికెట్ల జారీలో పారదర్శకత ఉంటుందన్నారు.క్షేత్రములో భక్తులు ఆయా సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా మరిన్ని మార్గ సూచికలను , సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వీటిని ఆకర్షణీయ పద్ధతిలో ఏర్పాటు చేయాలన్నారు.రోజు రోజుకు క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతున్న కారణంగా వసతి ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తుడికోసం డార్మెటరీ వసతి సదుపాయాన్ని మరింతగా పెంపొందించాలన్నారు.
వసతి నిర్మాణాల కోసం దాతల సహకారాన్ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వసతి నిర్మాణంతో పాటు దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాదాల వితరణ (అన్నదానం), గో సంరక్షణ, ప్రాణదాన మొదలైన పథకాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. దీనివలన దాతలకు విరాళాలు అందించే అవకాశం కలుగుతుందన్నారు.వారాంతపు రోజులు , సెలవురోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటోందని చెబుతూ ఆయా రోజులలో అదనపు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
క్యూకాంప్లెక్స్ లో గతంలో వలనే టీవీలను ఏర్పాటు చేసి భక్తులు శ్రీశైల టీవి ప్రసారాలను వీక్షించే అవకాశం కల్పించాలన్నారు. దీనివలన దేవస్థానంలో జరిగే ఆయా పూజాదికాల గురించి భక్తులు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు.ఆలయములో కొన్ని క్యూలైన్లు మొదలైన చోట్ల ఉండే ఇనుపకటాంజనాలను తొలగించి ఇత్తడి కటంజనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఇత్తడి కటాంజనాలను కూడా ఆలయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కళాత్మకంగా ఉండాలన్నారు.
అదేవిధంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. దేవస్థానం కాటేజీలు, అతిథిగృహాలు, సత్రాలతో పాటు రహదారులన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు.భక్తుల సంఖ్య పెరుగుతున్న కారణంగా శౌచలయాలు, మరుగుదొడ్లను మరిన్నింటిని ఏర్పాటు చేయాలన్నారు.భక్తులరద్దీకి అనుగుణంగా స్వచ్ఛమైన త్రాగునీటిని అందజేస్తుండాలన్నారు. జలప్రసాద కేంద్రాల వద్ద నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు, సుందరీకరణకు అవకాశమున్నచోట్ల విరివిగా మొక్కలను నాటాలన్నారు. అదేవిధంగా పచ్చికబయళ్ళను పెంపొందించాలన్నారు. ఈ క్షేత్రపరిధిలో వాహనాలను నిలుపుకునేందుకు వీలుగా మరిన్ని పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు.ముఖ్యంగా ఉద్యోగులందరు సమిష్టిగా పనిచేస్తూ క్షేత్రాభివృద్ధికి పాటుపడాలన్నారు.శ్రీశైలక్షేత్రాన్ని అభివృద్ధి నమూనా ఆలయంగా తీర్చిదిద్దడానికి ఉద్యోగులందరు కలసికట్టుగా కృషి చేయాలన్నారు.