
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సి.ఎస్. సోమేశ్ కుమార్
హైదరాబాద్, జూలై 10 : రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక సురక్షిత చర్యలు చేపట్టాలని అన్నారు. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అదేవిధంగా ప్రతీ జిల్లా కలెక్టరేట్ లలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాల్ పల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయిందని, ఈ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటికే నిండిన అన్ని చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్దరించాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదని అన్నారు. గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తగు రసాయన పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంత రావు, ఎస్పీడీసీఎల్ ఎండి రఘుమా రెడ్డి లతో పాటు సంబందిత అధికారులు హాజరయ్యారు.