చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

హైదరాబాద్, ఆగస్టు 29 :: చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం  ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రా కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు  తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణ లోకి తీసుకుంటూ,  ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆస్తుల పరిరక్షణకు హైడ్రాకు మరిన్ని అధికారులను,సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన్న చర్యలపై  సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటలీజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకెట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఎసిబి డైరెక్టర్ తరణ్ జోషి,  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారని, దీనిని నివారించటానికి, ఓ.ఆర్.ఆర్.పరిధిలో అన్ని విధాలా ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. జీ.హెచ్,ఎంసీ, ల్యాండ్ ఏంక్రోచ్మెంట్ ఆక్ట్, వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారి చేసే అన్ని రకాల నోటీసులు, తొలగింపులన్నీ పూర్తిగా ఒకే విభాగం హైడ్రా పరిధిలోకి తేనున్నట్టు వివరించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు తెలిపారు.  ఎఫ్.టీ.ఎల్, నాలా ఎంక్రోచ్మెంట్, , ప్రభుత్వ కాళీ స్థలాలు, పార్కుల పరిరక్షణ లను హైడ్రా పరిధిలోకి తేనున్నామని చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుండి హైడ్రా పరిధిలోకి తేనున్నామని వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయాడానికి కావాల్సిన పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుండి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయించనున్నట్టు సి.ఎస్. తెలిపారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, రంగారెడ్డి జిలా కలెక్టర్ శశాంక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పౌత్రు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి లు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.