శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర బృహత్తర ప్రణాళిక రూపకల్పన గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.విజయవాడలోని ప్రభుత్వ కార్యదర్శి క్యాంపు కార్యాలయం లో జరిగిన ఈ సమావేశంలో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి ( పూర్తి అదనపు బాధ్యత) , దేవదాయశాఖ కమిషనర్ డా.ఎం.హరిజవహర్లాల్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, చీఫ్ ఇంజనీరు ఎస్. శ్రీనివాసరావు, దేవదాయశాఖ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు దుర్గేష్, దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ పాల్గొన్నారు.సమావేశంలో బృహత్తర ప్రణాళిక రూపకల్పన సంస్థలైన ద్రోణా కన్షల్టెన్సీ, క్రియేటివ్ కన్సల్టెన్సీ, దేవస్థానానికి సాఫ్ట్వేర్ రూపొందించిన నైన్ అండ్ నైన్ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే 25 – 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బృహత్తర ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు.ముఖ్యంగా భక్తుల సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధి ప్రాతిపదికగా ప్రణాళికలలో ఆయా అంశాలను పొందుపర్చాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పట్ల ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.
భక్తులరద్ధీకనుగుణంగా క్యూకాంప్లెక్స్ నిర్మాణం, అవసరమైనచోట్ల అంతర్గత రహదారుల విస్తరణ, సామాన్య భక్తుల కోసం డార్మెటరీ వసతి నిర్మాణం, దాతల విరాళాలలో కాటేజీల నిర్మాణం, పలుచోట్ల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సృజన్మాత్మక విద్యుద్దీకరణ, ప్రాచీన కట్టడాలను పరిరక్షించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటడం, సుందరీకరణలో భాగంగా క్షేత్రపరిధిలో పచ్చదనాన్ని పెంపొందించడం, మరికొన్ని చోట్ల ఉద్యానవనాల ఏర్పాటు, ల్యాండ్ స్కేపింగ్ పనులు మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు.
క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా క్యూకాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రధాన అంశంగా గుర్తించాలన్నారు.ఆలయం ఎదురుగాశివం వీధి ( రథశాల – • నందిమండప మార్గం ) బయలువీరభద్రస్వామి వీధులను ( రథశాల – పోస్టాఫీస్ మార్గం) సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. క్షేత్రంలో రథోత్సవం, ప్రభోత్సవం, వాహనసేవలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తగు విధంగా గ్యాలరీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఇటీవల సర్వే అండ్ రికార్డ్ శాఖ, అటవీశాఖ, దేవస్థానం సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో గుర్తించిన 7 చదరపు మైళ్ళ క్షేత్ర పరిధిలోని ప్రదేశాన్ని ఆయా జోన్లుగా విభజించుకుని తదనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి .ముఖ్యంగా క్షేత్రపరిధిని యాక్టివ్ జోన్, పాసివ్ జోన్, ప్రొటెక్టివ్ జోన్లుగా విభజించి తదనుగుణంగా బృహత్తర ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు.యాక్టివ్ జోను లో తిరిగి హై సెక్యూరిటీజోన్, టెంపుల్ యాక్టివిటీ జోన్, టెంపుల్ ఫెసిలిటీ జోన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.హైసెక్యూరిటీ జోన్ లో ప్రధానాలయం, ఆలయ శివవీధులు (మాడవీధులు), క్యూకాంప్లెక్స్, అన్నప్రసాద వితరణ, ప్రసాదాల విక్రయకేంద్రాలు, పుష్కరిణి తదితర ప్రదేశాలు ఉండేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.టెంపుల్ యాక్టివిటీ జోన్ లో వసతి కల్పన, కల్యాణకట్ట, స్వల్పస్థాయి పార్కింగ్ ప్రదేశాలు, శౌచాలయాలు మొదలైనవాటిని పొందుపర్చాలన్నారు.
టెంపుల్ ఫెసిలిటీ జోన్ లో విశాలమైన పార్కింగ్ ప్రదేశాలు, ఇతర అవసరాలు మొదలైనవి ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.ఇక పాసివ్ జోన్ లో భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలను చేర్చాలన్నారు. క్షేత్ర పరిధికి సంబంధించిన సరిహద్దులకు అనుగుణంగా ప్రొటెక్టివ్ జోన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
శ్రీశైలముఖద్వారం ( ఆర్చిగేటు), హాఠకేశ్వరం, కైలాసద్వారం, టోల్ గేట్ మొదలైన ప్రదేశాలతో పాటు అవసరమైన ఇతర చోట్ల కూడా పరస్పర బదిలీ విధానములో అటవీభూమిని పొందేవిధంగా ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ పరస్పర బదిలీవిధానములో దేవస్థానము అటవీశాఖనుండి పొందిన భూమికి రెండింతల విస్తీర్ణములో దేవస్థానము భూమిని అటవీశాఖకు బదలాయించవలసి వుంటుంది. అవసరమైన ప్రదేశాలలో ఒక ఎకరా భూమిని అటవీశాఖ నుండి భూమిని అటవీ శాఖకు బదలాయించవలసివుంటుంది.
ప్రధాన ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ హాటకేశ్వరం వద్ద విశాలమైన టోల్ ప్లాజా నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మొత్తం మీద బృహత్తర ప్రణాళికలకు సంబంధించిన ఆయా ప్రతిపాదలన్నింటినీ నెలరోజుల్లోగా సిద్ధం చేయాలన్నారు.తరువాత జరిగే సమీక్షా సమావేశంలో ఈ అంశాలన్నింటినీ తిరిగి సమీక్షించడం జరుగుతుందన్నారు.