కోవిడ్ త‌గ్గాకే స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు- భ‌క్తుల ఆరోగ్య‌భ‌ద్ర‌త కోస‌మే ఈ నిర్ణ‌యం

డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో భ‌క్తుల ప్ర‌శ్న‌ల‌కు ఈఓ డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మాధానాలు

తిరుమల, 2021 ఆగ‌స్టు 07: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో శ‌నివారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇందులో ప‌లువురు భ‌క్తులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మాధానాలిచ్చారు.

1. సురేష్ – నెల్లూరు, శ్రీ‌నివాస్ – క‌రీంన‌గ‌ర్‌

ప్రశ్న:   ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు జిల్లాలోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల ద్వారా కొన్ని అయినా ఇవ్వాలి ?

ఈవో :  క‌రంట్ బుకింగ్‌లో జారీ చేస్తే ర‌ద్దీ ఎక్కువై కోవిడ్ వ్యాప్తి పెరిగే ప్ర‌మాద‌ముంది. కావున ప్ర‌స్తుతం స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభించే ప‌రిస్థితులు లేవు.

2. విజ‌య – త‌ణుకు

ప్రశ్న:   అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బాణీలు క‌ట్టాల‌ని ఉంది?

ఈవో : మిమ్మ‌ల్ని సంప్ర‌దించి అర్హులైతే అవ‌కాశం క‌ల్పిస్తాం.

3. సూర్య‌నారాయ‌ణ‌మూర్తి – పెద్దాపురం

ప్రశ్న:   శ్రీ‌వారి ఆల‌యంలోని విమాన వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మ‌క‌ర‌తోర‌ణం క‌నిపించలేదు?

ఈవో : శుభ్ర‌ప‌రిచేందుకు తొల‌గించి ఉంటారు. తిరిగి ఏర్పాటు చేశారు.

4. కుమార్ – హైద‌రాబాద్‌

ప్రశ్న:   జులై 25న ద‌ర్శనానికి వ‌చ్చాం. స్వామివారిని 5 నిమిషాలు కూడా ద‌ర్శించుకోనివ్వ‌లేదు ?

ఈవో : భ‌క్తుల‌కు 30 సెక‌న్ల‌కు మించి ద‌ర్శ‌నం చేయించే అవ‌కాశం లేదు.

5. హ‌రీష్ – పీలేరు

ప్రశ్న:   గోవింద‌మాల వేసుకుని న‌డిచివ‌చ్చే భ‌క్తుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలి ?

ఈవో : అవ‌కాశం లేదు.

6. మాధ‌వి – హైద‌రాబాద్‌

ప్రశ్న:   వృద్ధుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌న సౌక‌ర్యం ఉందా ?

ఈవో : న‌డ‌వ‌లేని వృద్ధుల‌ను బ‌యోమెట్రిక్ ప‌క్క గేటు నుంచి అనుమ‌తించి జ‌న‌ర‌ల్ లైన్‌లో ద‌ర్శ‌నం చేయిస్తాం.

7. క్రాంతికుమార్ – జ‌మ్మ‌ల‌మ‌డుగు, రాజీవ్ – చెన్నై

ప్రశ్న:   ఆన్‌లైన్‌లో టికెట్లు విడుద‌ల స‌మ‌యంలో లోడ్ పెరిగి వెబ్‌సైట్ ప‌నిచేయ‌డం లేదు ?

ఈవో : టిసిఎస్ టెక్నిక‌ల్ టీమ్ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.

8. ప్ర‌భాక‌ర్ – చెన్నై

ప్రశ్న:   ఆగ‌స్టు 13న గ‌రుడ‌పంచ‌మి రోజు ఉత్స‌వ‌మూర్తుల‌కు గొడుగులు, వ‌స్త్రాలు కానుక‌గా ఇవ్వొచ్చా ?

ఈవో : ఉత్స‌వం జ‌రిగే రోజు ఇవ్వ‌డానికి సాధ్యం కాదు.

9. నాగ‌మ‌ల్లేశ్వ‌రి – వినుకొండ, చిన్న‌య్య – తెనాలి, స‌త్య‌నారాయ‌ణ – హైద‌రాబాద్‌

ప్రశ్న:  ఆన్‌లైన్‌లో క‌ల్యాణోత్స‌వం బుక్ చేసుకున్నాం. ఆగ‌స్టు 14న ద‌ర్శ‌నానికి రావ‌చ్చా, జూన్ 12వ తేదీకి ద‌ర్శ‌న టికెట్ తీసుకుని రాలేక‌పోయాం. ఇప్పుడు రావ‌చ్చా ?

ఈవో : ఆన్‌లైన్ స్లాట్‌లో ఖాళీ ఉంటే బుక్ చేసుకుని రావ‌చ్చు. ఏరోజు ద‌ర్శ‌న టికెట్ తీసుకుంటే ఆరోజే ద‌ర్శ‌నానికి రావాలి. క‌ల్యాణోత్స‌వం టికెట్ బుక్ చేసుకున్న ఏడాదిలోపు ఎప్పుడైనా ద‌ర్శ‌నానికి రావ‌చ్చు.

10. ఈశ్వ‌ర్ – క‌ర్నూలు

ప్రశ్న:   ఏప్రిల్ 14న రూ.300/- ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకుని ద‌ర్శ‌నానికి వ‌స్తే 23వ తేదీ వ‌రకు ద‌ర్శ‌నానికి పంపేది లేద‌ని వెన‌క్కు పంపారు ?

ఈవో : ఈ విష‌యంపై విచార‌ణ జ‌రిపించి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేస్తాం.

11. శ్రీ‌నివాస్ – కాకినాడ‌

ప్రశ్న:   ఆన్‌లైన్‌లో క‌ల్యాణం టికెట్ బుక్ చేసుకుంటే ద‌ర్శ‌నానికి రావ‌చ్చా ?

ఈవో : ఏడాదిలోపు ఎప్పుడైనా రావ‌చ్చు.

12. రాజు – యానాం

ప్రశ్న:   తిరుమ‌ల‌లో కోవిడ్ నిబంధ‌న‌ల అమ‌లు బాగుంది. ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదం ఏర్పాట్లు బాగున్నాయి?

ఈవో : ధ‌న్య‌వాదాలు.

13. సుబ్ర‌హ్మ‌ణ్యం – హైద‌రాబాద్‌

ప్రశ్న:   ఎస్వీబీసీలో మంచి కార్య‌క్ర‌మాల మ‌ధ్య‌లో ఇబ్బంది క‌లిగించేలా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ప్ర‌తిరోజూ సాయంత్రం పండితుల‌తో విష్ణుస‌హ‌స్ర‌నామం  శ్లోకం పారాయ‌ణం చేయిస్తూ వీక్ష‌కుల‌తో కూడా చ‌దివించాలి ? గీతా పారాయ‌ణం చాలా బాగుంది. మ‌ళ్లీ చేయించండి.

ఈవో : విష్ణుస‌హ‌స్ర‌నామం  శ్లోకం పారాయ‌ణాన్ని ప‌రిశీలిస్తాం. వీక్ష‌కుల‌కు ఇబ్బంది లేకుండా ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌సారం చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాం.

14. బాలు – హైద‌రాబాద్‌

ప్రశ్న:   ఆగ‌స్టు 15 నుండి 19 వ‌ర‌కు బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుందా. స్వామివారి అభిషేకం ద‌ర్శించ‌డం జీవిత‌ల‌క్ష్యం. సామాన్యుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించండి?

ఈవో : బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది. కోవిడ్ పూర్తిగా త‌గ్గితే గానీ ఆర్జిత సేవా టికెట్లు పున‌రుద్ధ‌రించే అవకాశం లేదు.

15. వెంక‌ట‌మోహ‌న‌రావు – హైద‌రాబాద్‌

ప్రశ్న:  ఆగ‌స్టు 3న ద‌ర్శ‌నానికి వ‌చ్చాం. రంగనాయ‌క మండ‌పం వ‌ద్ద భౌతిక‌దూరం పాటించ‌డం లేదు ?

ఈవో : ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటాం.

16. సుబ్ర‌మ‌ణ్య‌శాస్త్రి – కొత్త‌పేట‌

ప్రశ్న:   ఎస్వీబీసీ ప్ర‌సారం చేసిన భ‌గ‌వ‌ద్గీత‌, సుంద‌ర‌కాండ పారాయ‌ణం అద్భుతంగా ఉన్నాయి?

ఈవో : ధ‌న్య‌వాదాలు.

17. శ్రీ‌కాంత్ జోషి – మెద‌క్‌

ప్రశ్న:   అఖండనామ‌ సంకీర్త‌న బృందాల లీడ‌ర్‌, సెకండ్ లీడ‌ర్‌కు వ‌యసు 60 దాటితే అనుమ‌తించ‌డం లేదు?

ఈవో : కోవిడ్ త‌గ్గాక అఖండ‌నామ సంకీర్త‌న‌ను పున‌రుద్ధ‌రించి వ‌య‌సు పెంపు అంశాన్ని ప‌రిశీలిస్తాం.

18. ప్ర‌సాద్ – నెల్లూరు

ప్రశ్న:   భ‌క్తుల‌కు ఆన్‌లైన్‌లో రూ.300/-, రూ.500/- గ‌దులు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ కోసం ఉంచ‌డం లేదు?

ఈవో : ప్ర‌స్తుతం కాటేజీల మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్నాయి. అందుబాటులో ఉన్న రూ.300/-, రూ.500/- గ‌దులు ఆన్‌లైన్లో ఉంచాం.

19. రాగిణి – క‌డ‌ప‌

ప్రశ్న:   మా అబ్బాయి 2020వ సంవ‌త్స‌రంలో ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో 12 సంవ‌త్స‌రాల కోర్సు పూర్తి చేశాడు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి స‌ర్టిఫికేట్లు ఇవ్వ‌లేదు?

ఈవో : కోవిడ్ వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ఏర్పాట్లు చేస్తాం. త్వ‌ర‌లో త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇస్తాం.

20. ముర‌ళీకృష్ణ – వైజాగ్‌

ప్రశ్న:   ఎస్వీబీసీ శ‌త‌మానంభ‌వ‌తి కార్య‌క్ర‌మానికి మా వివ‌రాలు, ఫొటో పంపినా ప్ర‌సారం కావ‌డం లేదు, నాద‌నీరాజ‌నంలో మైకులు స‌రిగా వినిపించ‌డం లేదు ?

ఈవో : శ‌త‌మానంభ‌వ‌తి కార్య‌క్ర‌మంలో రోజుకు 60 మందికి మాత్ర‌మే ఆశీర్వ‌చ‌నం అందించే అవ‌కాశ‌ముంది. మ‌రోసారి ప్ర‌య‌త్నం చేయండి. నాద‌నీరాజ‌నం వేదిక‌పై మైకుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం.

19. శ్రీకాంత్ – మంచిర్యాల

ప్రశ్న:   మా ఊరిలో ఆల‌యం కోసం విగ్ర‌హాల కోసం ద‌ర‌ఖాస్తు చేశాం. కోవిడ్ వ‌ల్ల డిడి క‌ట్ట‌లేక‌పోయాం. ఇప్ప‌డు పంపొచ్చా?

ఈవో : డిడి తీసి పంపితే విగ్ర‌హాలు మంజూరు చేస్తాం.

20. శంక‌ర్ – హైద‌రాబాద్‌

ప్రశ్న:   మూడేళ్లుగా ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్లో దొర‌క‌డం లేదు. తిరుమ‌ల‌లో ల‌క్కీడిప్ ద్వారా కొన్ని ఆర్జిత‌సేవా టికెట్లు కేటాయించండి ?

ఈవో : కోవిడ్ త‌గ్గి సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాక ప‌రిశీలిస్తాం.

print

Post Comment

You May Have Missed