శ్రీశైల దేవస్థానం: శ్రీశైలం ఘంటామఠ పునర్నిర్మాణ పనులలో తామ్రశాసనాలు లభ్యం అయ్యాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.
ఈ రోజు (13.06.2021) న ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా మొత్తం 21 తామ్రశాసనాలు (రాగిరేకులు) లభించాయి. మొదట 18 రాగిరేకులు లభించగా, ఆ తరువాత మరో 3 రాగిరేకులు లభించాయి.
ఈ శాసనాలలో కొన్ని నందినాగరిలిపిలో (సంస్కృత భాషలో) ఉండగా, మరికొన్ని తెలుగులో ఉన్నాయి.
ఘంటామఠ ప్రాంగణంలో ప్రధానాలయానికి ఉత్తరవాయువ్యంలో మట్టి పనులు చేయిస్తుండగా, ఈ తామ్రశాసనాలను దొరికాయి. ఈ
విషయం తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారి కే .ఎస్.రామరావు సంబంధిత అధికారులతో కలిసి ఘంటామఠం చేరుకుని తామ్రశాసనాలను పరిశీలించారు. .
ఈ తామ్రశాసనాలు దొరికిన వెంటనే స్థానిక రెవెన్యూ, పోలీసుశాఖలకు సమాచారాన్ని తెలిపారు.
రాష్ట్ర పురావస్తుశాఖ, కర్నూలు అధికారులకు కూడా సమాచారాన్ని పంపారు.
రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీబాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ స్థపతి జవహర్, సహాయ ఇంజనీరు సురేష్ తదితరులు పంచనామా చేసి తామ్రశాసనాల వివరాలను నమోదు చేశారు.
శ్రీశైలానికి క్యాంపుగా విచ్చేసిన కర్నూలు రెవెన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్, తహశీల్దార్ రాజేంద్రసింగ్, డిప్యూటీ తహశీల్దార్ జి.వి. మల్లికార్జునరావు , స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. వెంకటరమణ తదితరులు ఘంటామఠం చేరుకుని ఈ తామశాసనాలను పరిశీలించారు.
కార్యనిర్వహణాధికారి కే .ఎస్.రామరావు మాట్లాడుతూ ఘంటామఠప్రాంగణములో లభిస్తున్న పురాతన శాసనాలను శ్రీశైలక్షేత్ర చారిత్రక వైభవానికి ప్రతీకగా చెప్పవచ్చునన్నారు.
రాష్టదేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి, దేవదాయ కమి షనర్, కర్నూలు జిల్లా కలెక్టర్ లకు తామ్రశాసనాలు లభించిన విషయాన్ని నివేదిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
తరువాత కర్నూలు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ శాసనాల వలన శ్రీశైలక్షేత్ర చరిత్రకు సంబంధించిన మరిన్ని చారిత్రక అంశాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
లభించిన ఈ తామ్రశాసనాలను వీడియోకాల్ ద్వారా డా. మునిరత్నంరెడ్డి, డైరెక్టర్ (ఎపిగ్రఫీ) అర్కియాలాజికల్ సర్వేఆఫ్ ఇండియా, మైసూర్ వారికి ప్రదర్శింపజేసారు .
డా. మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ శాసనలిపిని బట్టి ఇవి ప్రాథమికంగా ప్రస్తుతశకం 14 – 16 శతాబ్దాలనాటివిగా భావించవచ్చునన్నారు. వీటిలోని విషయాలను అధ్యయనం చేసి విశ్లేషించడం వలన శాసనాలలో పేర్కొనబడిన అంశాలు తెలుస్తాయన్నారు.