శ్రీశైల దేవస్థానం:సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ ఓ చెప్పారు.మార్చి 30వ తేదీ నుంచి ఏప్రియల్ 4వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఆయా సౌకర్యాలు కల్పించే విషయమై చర్చించేందుకు సోమవారం సాయంకాలం కర్ణాటక,మహారాష్టలకు చెందిన పలు పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్చంద సేవాసంస్థల భక్త బృందాలతో రెండో విడత సమన్వయ సమావేశం జరిగింది. ఈ విషయమై ఈ నెల 9వ తేదీన కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్) లో వీరితో మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్), బాగల్ కోట్, బెల్గాం, తుముకూరు, రబ్ కవి,తేరదాళ్, అఖిని, తికోట తదితర ప్రాంతాలు, మహారాష్ట్రలోని షోలాపూర్, అక్కల్ కోట్ ప్రాంతాలకు చెందిన సుమారు 30కిపైగా భక్తబృందాలు, పాదయాత్ర భక్త బృందాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ ఓ మాట్లాడుతూ విజయపుర (బీజాపూర్)లో జరిగిన మొదటి సమన్వయ సమావేశానికి ,ధర్మప్రచారంలో భాగంగా అక్కడ జరిపిన ధర్మరథయాత్ర, కల్యాణోత్సవానికి కర్ణాటక , మహారాష్ట్ర భక్త బృందాలు ఎంతగానో సహకరించాయని చెబుతూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసినట్లుగానే పెద్ద చెరువు వద్ద కంకణాలను (రిస్ట్యండ్లను) ధరింపజేయడం జరుగుతోందన్నారు. ఈ పాదయాత్ర భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. భక్తులు సేద తీరేందుకు ఆరుబయలు ప్రదేశాలలో చలువపందిర్లు వేస్తామన్నారు . అన్ని చలువ పందిర్ల వద్ద మంచినీటి సదుపాయం కల్పిస్తామన్నారు.
క్యూలైన్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం ఇస్తామని ఈ ఓ చెప్పారు. ఈ వితరణకుగాను స్వచ్ఛంద సేవకులు సేవలను అందించాలన్నారు.ఉత్సవాల సందర్భంగా క్షేత్రపరిధిలో పలుచోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు ఉంటాయన్నారు. దేవస్థానం వైద్యశాల నిరంతరం వైద్యసేవలను అందిస్తుందన్నారు.శ్రీశైలక్షేత్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రం కూడా నిరంతరం వైద్యసేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా బహిరంగ మలమూత్ర విసర్జనలను క్షేత్రపరిధిలో నిషేధించడం జరిగిందని, భక్తాదులందరు దేవస్థానం పలుచోట్ల ఏర్పాటు చేసిన శౌచలయాలను వాడుకోవాలన్నారు. ఈ విషయమై స్వచ్ఛంద సేవా సంస్థల వారు భక్తులలో మరింత అవగాహన కల్పించాలన్నారు.
భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పించే ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అలంకార దర్శనం కల్పించే 31వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అధిక సంఖ్యలో కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుందని, ఈ రోజులలో దర్శనానికి 5 గంటల నుంచి 10 గంటలకు పైగా సమయం పడుతుందని, భక్తులు ఈ విషయం లో సహకరించాలని ఈ ఓ కోరారు.
స్వచ్ఛంద సేవకుల సేవలు:
ఉగాది మహోత్సవాలలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగిస్తారు. ఈ స్వచ్చంద సేవకులు స్వామివారి ఆలయం, ముఖమండపం, నందిమండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్రదర్శనం ఉచిత క్యూలైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, గంగాభవానిస్నానఘట్టాలు, హఠకేశ్వరం, సాక్షిగణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ తదితర చోట్ల ఆయా సేవలను అందించవలసి ఉంటుంది.
స్వచ్చంద సేవకులు అందరు కూడా మార్చి 24నుంచి ఏప్రియల్ 3 వరకుకు ఆయా సేవలు అందిస్తారు.
లాటరీ ద్వారా సేవా ప్రదేశాల కేటాయింపు: స్వచ్ఛంద సేవకులకు సేవా ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గతంలో వలెనే లాటరీ పద్ధతిలో సేవా ప్రదేశాలను కేటాయిస్తారు.
సమావేశంలో హాజరైన స్వచ్ఛంద సేవకుల చేతుల మీదుగానే ఈ లాటరీ ప్రక్రియ చేపట్టారు.
సమావేశం లో దేవస్థాన పరిపాలన, ఆలయ, శ్రీశైలప్రభ విభాగాధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.