శ్రీశైల దేవస్థానం: చెంచు భక్తులకు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం దొరికింది.ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించారు. గత నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభించారు
ప్రతీ నెలలో కూడా చివరి బుధవారం రోజున చెంచు గిరిజన భక్తులకు ఈ ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించారు
ఇందులో భాగంగా బుధవారం చెంచు భక్తులకు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం ఉచితంగా దొరికింది.
మొత్తం 232 చెంచు గిరిజనులు ఈ రోజు స్వామివార్ల స్పర్శదర్శనం, అమ్మవారిని దర్శించుకున్నారు.
స్థానిక మేకలబండ, హాటకేశ్వరం, సున్నిపెంటలోని చెంచుభక్తులతో పాటు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం హనుమాపురం తాండ, మాచర్ల మండలం బోధనంపాడు, దుర్గి మండలం తేరాల నుంచి కూడా చెంచు భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చెంచు గిరిజనులకు దేవస్థానం ఉచిత వసతి, అల్పాహార, భోజన సదుపాయం కల్పించింది.
అదేవిధంగా దర్శనానంతరం చెంచు భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం అధికారులు వారికి ఆహ్వానం పలికారు.
తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ తాము పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడెములను సందర్శించానన్నారు.
ఆ సందర్భంలో చెంచు భక్తులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించవలసినదిగా కోరడం జరిగిందన్నారు. తదనుగుణంగా ధర్మకర్తల మండలి సమావేశంలో చెంచుభక్తులకు నెలలో ఒకరోజున ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని ర్మకర్తల మండలి సమావేశములో తీర్మానించడం జరిగిందన్నారు. నెలలో ఒకరోజున చెంచు భక్తులకు ఈ ఉచిత స్పర్శదర్శనం కల్పించడం జరుగుతున్నదన్నారు.
తరువాత కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిడిగా భావిస్తారన్నారు. దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం లో ప్రత్యేకంగా చెంచుల సంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. అలాగే ఇటీవల జరిగిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో దివ్య కల్యాణమహోత్సవానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు.
శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి గంగమ్మ, ఐ.టి.డి.ఏ సిబ్బంది పాల్గొన్నారు.
