
శ్రీశైల దేవస్థానం:క్షేత్ర అభివృద్ధి పనులలో భాగంగా దేవస్థానం చేపట్టిన గణేశసదనమును కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్నఈ రోజు( 04.09.2021)న పరిశీలించారు.
ఈ పరిశీలనలో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఇంజనీరు నరసింహరెడ్డి, ఉద్యానవన హార్టికల్చరిస్ట్ లోకేష్, తదితర ఇంజనీరింగ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 224 గదుల సముదాయాముగా గణేశ సదనము నిర్మాణమవుతోంది.
మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ లో 56 గదులు, బి బ్లాకులో 56 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64 గదులు ఉంటాయి.
ఈ ఉదయం నాలుగు బ్లాకులలోని ఆయా నిర్మాణపు పనులను కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.ఆ తరువాత సి బ్లాక్ లో నిర్మితమవుతున్న రిసెప్షన్ కౌంటర్లు, రెస్టారెంట్, వెయిటింగ్ హాల్ నిర్మాణాలను కూడా పరిశీలించారు.
అదేవిధంగా నిర్మాణానికి ఉపయోగిస్తున్న ముడిసరుకుల నాణ్యతను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ క్షేత్రానికి భక్తులరద్దీ రోజు రోజుకు పెరుగుతుందని, రద్దీని దృష్టిలో పెట్టుకుని గణేశ సదనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఇంకా వసతి సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నారు.
అదేవిధంగా సముదాయ ప్రాంగణమంతా కూడా పచ్చదనం పెంపొందే విధంగా ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా చేపట్టాలన్నారు. ప్రాంగణములో అనువైన మొక్కలను నాటాలని ఉద్యాన విభాగాన్ని ఆదేశించారు.
మొక్కలు నాటే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని, దీనివలన నిర్మాణపు పనులు పూర్తయ్యేలోపల పచ్చదనం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందన్నారు.అదేవిధంగా నక్షత్రవనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
*పంచమఠాల పునర్నిర్మాణ పనుల పరిశీలన*
క్షేత్ర అభివృద్ధి పనులలో భాగంగా దేవస్థానం చేపట్టిన పంచమఠాల పునర్నిర్మాణ పనులను ఈ రోజు (04.09.2021 ) న కార్యనిర్వహణాధికారి పరిశీలించారు. ఘంటామఠం, రుద్రాక్షమఠం, విభూతి మఠాల పనులను ఈ రోజు పరిశీలించారు.
ఈ పరిశీలనలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీ బాలకృష్ణ, సహాయ స్థపతి ఐ.ఉమావెంకట జవహర్లాల్ తదితర ఇంజనీరింగ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
కాగా ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టారు.
ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కాగా పంచమఠాలలో విభూతిమఠ, రుద్రాక్షమఠ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అదేవిధంగా ఘంటామఠంలో ప్రధానాలయ పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఉపాలయాల పనులు జరుగుతున్నాయి.
కాగా ప్రస్తుతం విభూతిమఠములోపలి భాగములో రాతిబండపరుపు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం వెలుపలి భాగపు ప్రాంగణములో బండపరుపు పనులు జరుగుతున్నాయి.
అదేవిధంగా రుద్రాక్షమఠములో వెలుపలి భాగపు బండపరుపు పనులు దాదాపు పూర్తి అయ్యాయి.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ తక్కిన పునర్నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేసమయం లో పనుల నాణ్యత పట్ల పూర్తి శ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ
పంచమఠాల పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రతి మఠం చుట్టూ కంచె ( ఐరన్మెస్) ఏర్పాటు చేసి మఠాల ప్రాంగణాలలో పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.