జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండ్
* హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సంఘాలు.
జర్నలిస్టు రఘును పోలీసులు అక్రమంగా, దౌర్జన్యంగా కిడ్నాప్ చేసారని పలు జర్నలిస్టు సంఘాలు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాయి. రఘుపై అక్రమ కేసులు బనాయించి, తీవ్రవాదిలా అరెస్టు చేసారని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), టీ జర్నలిస్టుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, టీ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం హెచ్చార్సీ కార్యదర్శి విద్యాదర్ భట్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు రఘుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడం, మఫ్టీలో ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్లు పట్టుకెళ్ళడం మానవహక్కులకు, మీడియా స్వేచ్ఛకు భంగకరమని వారు పేర్కొన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని తాము పోరాడుతుంటే మరోవైపు తెలంగాణలో జర్నలిస్టులపై ఈ విధమైన అక్రమ కేసులు, అరెస్టులు, అణిచివేత కొనసాగడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, కార్యదర్శి ఏవీఎన్ రావు, కే. పాండురంగారావు, టీ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు సతీష్ కమల్, నాయకులు కొడిగంటి శ్రీనివాస్, స్వామి, పాలకూర రాజు,పోగుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment