
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఈ రోజు (05.09.2021)న దర్శన క్యూలైన్లను, క్యూకాంప్లెక్స్ మొదలైన వాటిని ఆకస్మికంగా పరిశీలించారు.అదేవిధంగా ఆర్జిత సేవా టికెట్ కౌంటర్లు, శీఘ్రదర్శనం , అతిశీఘ్రదర్శనం కౌంటర్లు మొదలైన వాటిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి పలువురు భక్తులతో ముఖాముఖిగా మాట్లాడుతూ , దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఆర్జిత సేవా కౌంటర్లు, దర్శన క్యూలైన్ల వద్ద ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా క్రమపద్ధతిలో భక్తులు సేవా టికెట్లను, దర్శనం టికెట్లను పొందే విధంగా క్యూలైన్ల నిర్వహణ ఉండాలని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి, ముఖ్యభద్రతా అధికారిని ఆదేశించారు.రద్దీ సమయాలలో క్యూకాంప్లెక్స్ లో దర్శనం కోసం వేచివుండే భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు మొదలైన వాటిని అందజేస్తుండాలన్నారు.
ఈ రోజు క్యూలైన్లలోని భక్తులకు సాంబారన్నం మరియు చిత్రాన్నం మొదలైనవాటిని అందించారు.
భక్తుల దర్శన సమయాలు, దర్శనాలకు పట్టే సమయం, ఆర్జిత సేవా వివరాలు మొదలైన వాటిని తరుచుగా ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా తెలియజేస్తుండాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. ఆలయ ప్రసారంలో విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు.
అన్నదాన విభాగం పరిశీలన :
కార్యనిర్వహణాధికారి అన్నదాన విభాగాన్ని పరిశీలించారు. అన్నదానము స్టాకు నిర్వహణ, ప్రస్తుత స్టాకు, స్టోరు, కూరగాయలు ఉంచే శీతలీకరణ గదిని పరిశీలించారు.అన్నప్రసాదాల తయారీలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నాణ్యత పట్ల జాగ్రత్త వహించాలన్నారు.ఎప్పటికప్పుడు భక్తులరద్దిని అంచనాలను వేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి అన్న ప్రసాదాలను అందజేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు –
శ్రావణమాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు.
కార్యనిర్వహణాధికారి ఎప్పటికప్పుడు దర్శనం క్యూలైన్లను, ఆర్జితసేవ క్యూలైన్లను పరిశీలించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
పర్యావరణ పరిరక్షణకు, సుందరీకరణ భాగంలో క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు.
ఈ మొక్కలు నాటే కార్యక్రమములో భక్తులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు (05.09.2021)న శ్రీ కృష్ణదత్తసాయి సేవాసమితి, నంద్యాల వారు దేవస్థానానికి పలు రకాల మొక్కలను అందజేశారు. అదేవిధంగా సదరు సంస్థ సభ్యులు మొక్కలను నాటే కార్యక్రమములో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో పాతాళగంగమార్గములోని సర్వతోభద్రవనములో బిల్వం, నూరువరహాలు, గన్నేరు, మందారం,చామంతి మొదలైన మొక్కలను నాటారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ క్షేత్రములో మొక్కలు నాటే కార్యక్రమం గురించి మరింత అవగాహన కల్పిస్తామని, భక్తులందరు కూడా ఈ కార్యక్రమములో పాల్గొనవచ్చునని అన్నారు.
అనంతరం శ్రీశైలం ప్రాజెక్టుకాలనీలోని దేవస్థానం నిర్మిస్తున్న స్టాఫ్ క్వార్టర్‌ను కూడా పరిశీలించారు.