×

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు- ప‌ల్ల‌కీ ఉత్స‌వంలో సాంస్కృతిక వైభవం

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు- ప‌ల్ల‌కీ ఉత్స‌వంలో సాంస్కృతిక వైభవం

తిరుమల, 2023 సెప్టెంబరు 22: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్ర‌వారం ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.

చెన్నై నుండి వచ్చిన క‌ళాకారులు గురువాయూరప్ప‌న్ అనే నృత్యకళ‌లో శ్రీకృష్ణలీలలను చక్కగా ఆవిష్కరించారు. గుజరాతీ ప్రాచీన జానపద కళారూపం గ‌ర్భ. కళ్యాణం అనంతరం దంపతులతో క‌లిసి చేసే ఆనందతాండవ క‌ళారూపం ఇది. దీన్ని సుమన బృందం అత్యంత మనోహరంగా ప్రదర్శించింది.

యం.జి.కటేకర్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుండి వచ్చిన డ్రమ్స్ వీనుల‌విందుగా సాగింది. మధ్యప్రదేశ్ ప్రాచీన జానపద కళారూపమైన బరిడిని పుష్కల బృందం భ‌క్తుల‌ను విశేషంగా ఆకట్టుకుంది. రాజమండ్రికి చెందిన రాణి బృందం మయూర నృత్యంతో కనువిందు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశీ పుణ్యక్షేత్రంలో శివతత్వాన్ని తెలిపే అఘోర నృత్యాన్ని రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ బృందం శివలాస్యంతో నేత్రానందాన్ని కలిగించింది.

రాజమండ్రికి చెందిన లక్ష్మీ ప్రసన్న బృందం తలం నృత్యంతో అలరించింది. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరుకు చెందిన అనురాధా క్రాంత్ బృందం భరతనాట్యంతో ఆక‌ట్టుకుంది. కేరళ‌ రాష్ట్రానికి చెందిన మహదేవన్ బృందం ప్రదర్శించిన గోపికా నృత్యం చ‌క్క‌గా సాగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నట్టువ అనే ఈ ప్రాచీన జానపద కళారూపాన్ని పద్మమాలిని బృందం తమ కళానైపుణ్యంతో ఆక‌ట్టుకున్నారు. తిరుపతికి చెందిన చందన బృందం తమ కోలాట నృత్యంతో అలరించింది. మొత్తం 11 కళాబృందాల్లో 248 మంది కళాకారులు పాల్గొన్నారు.

టీటీడీ ఛైర్మ‌న్  భూమ‌న క‌రుణాక‌రరెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి క‌లిసి వాహ‌న‌సేవ‌లో క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఆస‌క్తిగా తిల‌కించి క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.

print

Post Comment

You May Have Missed