
శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 17:-మహాశివరాత్రి ఉత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా సంబంధిత నోడల్ అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ స్పష్టం చేసారు. శుక్రవారం రాత్రి కమాండ్ కంట్రోల్ రూములో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై నోడల్ అధికారులో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్ని జోన్లలో పారిశుద్ధ్యం లోపం స్పష్టంగా కనిపిస్తోందని, సంబంధిత ఈఓఆర్డిలు, పారిశుద్ధ్య సిబ్బంది విధులలో నిర్లక్ష్యం చేస్తున్నారని, పద్దతి మార్చుకొని శనివారం ఏ ఒక్క లోపం తలెత్తకుండా అదనపు సిబ్బందిని కేటాయించి పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని అన్నారు. అన్ని ప్రాంతాలలో దోమల నియంత్రణకు తక్షణమే ఫాగింగ్ నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. అధికారుల సమన్వయం కొరవడడంతో లోపాలు కనిపిస్తున్నాయని, పరస్పర సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న పార్కింగ్ ప్రదేశాలకు అదనంగా గుర్తించిన ప్రదేశాలలో కూడా రాత్రింబవళ్లు చదును చేయించి పార్కింగుకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. చిరు వ్యాపారాలు పుట్ పార్టుల మీద విక్రయాలు జరపకుండా కేటాయించిన స్థలాలలో మాత్రమే అమ్మకాలు జరపేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రద్దీకనుగుణంగా ఎటువంటి లోట్లుపాట్లు లేకుండా నిరంతరం మంచినీటి సరఫరా చేస్తుండాలన్నారు. ముఖ్యంగా శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేవిధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. నిరంతరం నీటిసరఫరా వలన శౌచాలయాలలో పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వర్తించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎం. దాసు, దేవస్థానం ఈఈ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ హెచ్. వెంకటేష్, అన్ని జోన్ల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.