శ్రీశైలం/ నంద్యాల, జులై 30:-ఆగస్టు 1వ తేదీన శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లాలోని అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్నపూర్ణ ప్రసాద వితరణ భవన సముదాయంలోని సీసీ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్, జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజుతో కలిసి సి.యం ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైల క్షేత్ర పర్యటన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి విజయవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 1వ తేదీ ఉదయం 9.50 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకొని అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం, శ్రీశైల ప్రాజెక్టు వద్ద జలహారతి , కుడిగట్టు జలవిద్యత్ కేంద్ర సందర్శన, ( ఏ.పి. జెన్‌కో) , సున్నిపెంటలోని వాటర్ యూజర్సు అసోసియేషన్ వారితో ముఖాముఖి చర్చాగోష్టి మొదలైన అంశాలను వివరిస్తూ ఏర్పాట్లపై జిల్లా అధికారులను దిశానిర్దేశం చేశారు.
హెలిప్యాడ్ వద్ద పారిశుద్ధ్యం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు కలెక్టర్ . అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలన్నారు.
సాగునీటి వినియోగదారుల సంఘం సభ్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే ప్రదేశంలో సభావేదిక, కార్యక్రమ నిర్వహణ, ముఖాముఖి, ఇష్టాగోష్టి తదితర అంశాల గురించి పలు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి వచ్చే సాగునీటి వినియోగదారుల సంఘ సభ్యులతో తగు విధంగా మంచినీరు, స్నాక్సు ఏర్పాట్లు ఉండాలన్నారు. అదేవిధంగా సభా కార్యక్రమము జరిగే చోట వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యశాఖ సిబ్బందిని అదేశించారు. సభావేదిక వద్ద ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేయాలన్నారు.
అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ఆలయ దర్శనం, ఆలయంలో పూజాదికాల తదితర అంశాల గురించి వివరించారు.